ప్రభుత్వం దివాళా తీసిందా? ప్రజలు ధనవంతులుగా మారారా? ఏపీ హైకోర్టు

మంగళవారం, 26 మే 2020 (17:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మరో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల అమ్మాలని ప్రతిపాదించింది. పలు జిల్లాల్లో ఉన్న భూములను వేలం పాటల ద్వారా విక్రయించేలా జీవో జారేచేసింది. ఈ-వేలానికి సంబంధించి నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. 
 
ఈ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్తులు అమ్మడం ద్వారానే ప్రభుత్వాన్ని నడపడం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వం దివాళా తీసిందా? అని ప్రశ్నించింది. వేల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏపీలో ప్రజలు ధనవంతులుగా, ప్రభుత్వం పేదరికంగా ఉన్నట్టు ఉందని వ్యాఖ్యానించింది.
 
ఓవైపు లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో... ఇంత అర్జంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు నిలదీసింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి తాము ఇచ్చే ఉత్తర్వులకు లోబడే వేలం నిర్వహించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. దీంతో, తదుపరి విచారణను మే 28వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
 
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని హైకోర్టు పలు విధాలా తప్పుబట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది వెల్లడించారు. ఓవైపు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేస్తూ, మరోవైపు ప్రభుత్వ భూములు అమ్ముకోవడం ఏంటి? అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. ఆదాయం కోసం ఇతర మార్గాలు అన్వేషించాలి కానీ, ప్రభుత్వ భూములు అమ్ముకోవడం సబబు కాదని హితవు పలికిందని న్యాయవాది వెల్లడించారు. మొత్తంమీద ప్రభుత్వ భూములు అమ్మాలన్న నిర్ణయం కూడా వివాదాస్పదమై కోర్టు బోనుకు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు