మిగతా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులుండవని, యధాతథంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్లు దాఖలు చేసిన గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన 56 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. వారిలో 28 మంది వైకాపా అభ్యర్థులు, తెదేపా-17, భాజపా- 5, సీపీఐ-3, కాంగ్రెస్-2, జనసేనకు చెందిన ఒకరు నామినేషన్ అనంతరం వేర్వేరు కారణాలతో మృత్యువాతపడ్డారు. ఈ స్థానాలన్నింటిలో నామినేషన్ వేసేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
మున్సిపల్ ఎన్నికలపై ఈ నెల 22న తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జిల్లా కలెక్టర్లు, డీజీపీ, జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించనున్నారు. రాష్ట్ర పురపాలక, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సమీక్షకు హాజరుకానున్నారు. భేటీకి అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.