టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఇపుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈయన దొంగచాటుగా ఎమ్మెల్సీ అయి మంత్రిగా కొనసాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలన్నింటికీ చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో నారా లోకేష్ ఉన్నారు.
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకవేళ పెంపు జరిగితే మాత్రం ఓ నాలుగు కొత్తవి రావచ్చు.. ఆ నాలుగు ఎక్కడ అన్నదాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టత ఉంది.. ఇదివరకే ఆయన ఈ విషయంలో హోమ్‌వర్క్ చేసి ఉన్నారు. కాకపోతే ఆ నాలుగింటి కోసం టీడీపీ నేతల మధ్య పోటీ తీవ్రమైంది.. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఆ కొత్తవాటిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ప్రస్తుతం ఉన్న 14 నియోజకవర్గాలలో పూతలపట్టు.. గంగాధరనెల్లూరు.. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుగా ఉన్నాయి. మిగిలినవి జనరల్ కేటగిరిలో ఉన్నాయి. అయితే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నుంచే కొత్తవాటిని ఏర్పాటు చేయవచ్చు.. ఇదే ప్రాతిపదిక అయితే మాత్రం పలమనేరు.. చిత్తూరు.. చంద్రగిరి... పీలేరు.. నగరి... తిరుపతి నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈ నియోజకవర్గాల నుంచి కొత్త నియోజకవర్గాలు ఏర్పడవచ్చు. పలమనేరు నియోజకవర్గం పరిధిలోని వి.కోటను.. చిత్తూరు పరిధిలోని చిత్తూరు రూరల్‌ను.. చంద్రగిరి పరిధిలోని తిరుపతి రూరల్‌ను... నగరి పరిధిలోని పుత్తూరును.. పీలేరు పరిధిలోని కలికిరిని కొత్త నియోజకవర్గాలుగా ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. అందువల్ల తిరుపతి రూరల్ స్థానం నుంచి లోకేశ్‌ను బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.