పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడలేదని, సామాన్య పౌరుడిలా ప్రశ్నలేశారని.. ఆ విధానం తనను ఆకట్టుకుందని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సామాన్య పౌరుడిగా పవన్ చేస్తున్న ప్రయత్నాలు నచ్చాయని.. అందుకే ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యానని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
పవన్‌తో భేటీ అయ్యాక మీడియాతో మాట్లాడుతూ.. పవన్ తొలి ప్రశ్నతోనే ఆకట్టుకున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వమూ అసత్యాలు పలకవని.. కానీ నిజాలు మాత్రం దాస్తుందని ఉండవల్లి చమత్కరించారు. పవన్ కల్యాణ్ చాలామంది మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నారని.. నిజమైన రాజకీయాలను పవన్ ఇప్పుడే ప్రారంభించినట్లు ఉండవల్లి తెలిపారు.
ఈ ప్రయత్నంలో పవన్ కచ్చితంగా విజయం సాధిస్తారని ఉండవల్లి చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ వల్లే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఏపీకి న్యాయం జరగాలని పవన్ చేస్తున్న ప్రయత్నాలకు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.