సర్పంచి అభ్యర్థి కిడ్నాప్.. అధికార పార్టీ నేతలపై అనుమానం

ఆదివారం, 31 జనవరి 2021 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల పర్వం నడుస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
 
అయితే, ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాంలో తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలే తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామానికి చెందిన యల్లావుల తిరుపతిరావు తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలోని పోలేరమ్మ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేసేందుకు బయల్దేరగా.. కొందరు వ్యక్తులు ఆయనను బెదిరించి కిడ్నాప్ చేశారు. 
 
అధికార పార్టీకి చెందిన నేతలే తిరుపతిరావును కిడ్నాప్ చేశారని ఆయన బంధువులు, తెదేపా నేతలు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గ్రామానికి చేరుకొని కిడ్నాప్ విషయంపై ఆరా తీశారు. 
 
అనంతరం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్​కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బలగాల ద్వారా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాపైన అభ్యర్థిని విడిచిపెట్టే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని ఎమ్మెల్యే సాంబశివరావు భీష్మించి కూర్చొన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు