చెరువును తలపిస్తున్న తిరుపతి - తిరుమలలో కుంభవృష్టి

శుక్రవారం, 12 నవంబరు 2021 (09:49 IST)
తిరుమల తిరుపతి పట్టణంలో గత బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పాటు ఈదురుగాలులు వీయడంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో ట్రాఫిక్‌ అంతరాయమేర్పడింది. ఇస్కాన్‌ రోడ్డులోని ఫారెస్ట్‌ ఆఫీస్‌ వద్ద,రుయా, ప్రసూతి, చిన్నపిల్లల ఆస్పత్రి ఆవరణాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో కార్లు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. 
 
మధురానగర్‌, లక్ష్మీపురం, పద్మావతిపురం, కట్టకింద ఊరు ప్రాంతాల్లో మురికినీటితో కలిసిన వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రుయా ఆస్పత్రిలోని ప్రధాన భవనంపై నుంచి నీరు భవనం లోపలకు చేరడంతో  కొన్ని వార్డులు, కార్యాలయ గదులు వర్షపు నీటితో నిండిపోయాయి. ఇబ్బందులకు గురైన రోగులను వేరే వార్డులకు తరలించారు.
 
ముఖ్యంగా, తిరుచానూరులోని షికారి కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. చెర్లోపల్లి అండర్‌ బ్రిడ్జిలో రెండు ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. స్థానిక పోలీసుల సహాయంతో ప్రయాణికులు బయటకు రాగలిగారు. ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి, మేయర్‌ శిరీష, కమిషనర్‌ గిరీష నగరంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
తిరుమలలో బుధవారం మొదలైన వర్షం గురువారం వేకువజాము నుంచి ఈదురు గాలులతో జోరుగా కురుస్తోంది. పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం పడుతూనే ఉండటం, చలితీవ్రత పెరగడం, భారీ ఈదురు గాలుల నేపథ్యంలో చాలా మంది భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుగు ప్రయాణమయ్యారు. దుకాణాలన్నీ మూతపడ్డాయి. 
 
మొదటి ఘాట్‌ రోడ్డులోని రెండో మలుపు, రెండో ఘాట్‌ రోడ్డులోని పలు ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్ల కొమ్మలు కూలాయి. రెండో ఘాట్‌లోని లింక్‌ రోడ్డు వద్ద ఓ భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడటంతో సుమారు గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాపవినాశనం, శ్రీవారిపాదాలు మార్గాల్లోనూ కొండచరియలు, చెట్లు నేలకూలడంతో ఈ రోడ్లను టీటీడీ మూసివేసింది.
 
రాత్రికి కూడా వర్షం తగ్గకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాత్రి 8 గంటలకు రెండో ఘాట్‌రోడ్లనూ మూసివేశారు. తిరిగి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఘాట్‌రోడ్లలో వాహనాలు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తిరుమలలోని ఐదు జలాశయాలు నిండిపోయాయి. పాపవినాశనం, గోగర్భం డ్యాముల గేట్లు ఎత్తివేశారు. కుమారధార, పసుపుధార, ఆకాశగంగ  డ్యాముల్లో నీరు ఓవర్‌ ఫ్లో అవుతోంది. 
 
మరోవైపు, స్వర్ణముఖి, గార్గేయ, కాళంగి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అరణియార్‌ ప్రాజెక్టులో నాలుగు గేట్లు ఎత్తేసి, 3600 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కాళంగిలో ఓ పెద్దగేటుతో పాటు 12 చిన్న గేట్లను తెరిచారు. ఆరణియార్‌లో నాలుగు, పెనుమూరులోని ఎన్టీఆర్‌ జలాశయంలో నాలుగు గేట్లను ఎత్తేశారు. శ్రీకాళహస్తి మండలంలోని భైరవకోన, నారాయణవనం మండలంలోని కైలాసనాథకోన, వడమాలపేటలోని సదాశివకోన జలపాతాలు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు