బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... 13న ఒకటి.. ఆ తర్వాత...

శుక్రవారం, 12 నవంబరు 2021 (09:20 IST)
దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన తర్వాతం బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇపుడు మరో అల్పపీడనం ఏర్పడింది. 
 
ఇటీవల తాజాగా కొన్నిరోజుల వ్యవధిలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడగా తమిళనాడు, ఏపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్ సముద్రంలో ఏర్పడే ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం తీరం చేరిన నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
ఇదిలావుంటే, కడప జిల్లాలోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. రైల్వే కోడూరు మండలంలో 10.72 సెం.మీ వర్షపాతం నమోదైంది. పింఛ రిజర్వాయర్ నుంచి 12 వేల క్యూసెక్కులు, అన్నమయ్య రిజర్వాయర్ నుంచి 9.640 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
 
నెల్లూరు జిల్లాలో చేపల వేటకు వెళ్లిన 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోగా, కృష్ణపట్నం కోస్ట్ గార్డ్స్ వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నారు. అల్లూరు మండలం తాటిచెట్లపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు బోటులో సముద్రంలోకి వెళ్లగా, ఇంజిన్ మధ్యలోనే ఆగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు అధికారులను అప్రమత్తం చేశారు.
 
భారీ వర్షాలకు తిరుమల కొండపై 6 డ్యాములు ఉప్పొంగుతున్నాయి. తిరుమల నడకదారిలో నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు భారీ వర్షంతో, చలిగాలులతో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు