పాతపట్నంలో ఓడిన ఎమ్మెల్యే కుమారుడు : పరిషత్ ఎన్నికల్లో వైకాపా హవా

శుక్రవారం, 19 నవంబరు 2021 (07:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మలివిడత పరిషత్ ఎన్నికల్లో అధికార వైకాపా మళ్లీ హవా కొనసాగించింది. అనేక ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. అయితే, పాతపట్నంలో మాత్రం ఎమ్మెల్యే తనయుడుకి ఓటర్లు తేరుకోలేని విధంగా షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా 8 చోట్ల వైకాపా, 3 చోట్ల టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే, 129 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 85, టీడీపీ 35, జనసేనకు 5, సీపీఎంకు 2, సీపీఐ, బీజేపీకి ఒక్కో స్థానంలో గెలుపొందగా, రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల విజయం సాధించారు. 
 
అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో హిరమండలం జడ్పీటీసీ స్థానంలో వైకాపా ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రవణ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు చేతిలో 59 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
 
అలాగే, గుంటూరు జిల్లా వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న వినుకొండ అసెంబ్లీ స్థానంలో శావల్యాపురం జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పారా హైమావతి 1046 ఓట్ల ఆధిక్యంలో విజయం సాధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు