భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలేవీ అమలులోకి రావడం లేదని విపక్షాల విమర్శలకు ఏపీ సర్కారు గణాంకాలతో సూటిగా సమాధానమిచ్చింది. పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో 42 శాతం అమల్లోకి రావడంతో పాటు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ అగ్రస్థానంలో చేరింది. ఈ క్రమంలో గుజరాత్‌ను కూడా ఏపీ వెనక్కి నెట్టి రికార్డు సృష్టించింది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పారిశ్రామికంగా వెనక్కి పడిపోయింది. అందుకే సీఎం చంద్రబాబు పరిశ్రమలు ఆకర్షించడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గుజరాత్, ఢిల్లీలో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ఏపీలో నిర్వహించారు. ఇందుకు విశాఖలో సీఐఐ అనుమతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 328 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా రూ.4,62,234కోట్ల పెట్టుబడులొచ్చాయని ఏపీ సర్కారు తెలిపింది. ఈ సదస్సు ద్వారా విపక్షాలకు సరైన సమాధానం ఇచ్చినట్లైందని ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు. ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ముందుకొస్తున్నాయని ఏపీ మంత్రులు చెప్పారు.