తిరుపతికి చెందిన ఆరేళ్ళ బాలుడు అదరగొట్టాడు.. మైక్రోసాఫ్ట్ పరీక్షలో పాస్

సోమవారం, 30 ఆగస్టు 2021 (12:04 IST)
తిరుపతి చెందిన ఆరేళ్ళ బాలుడు అదరగొట్టాడు. ఎంతో కష్టతరమైన మైక్రోసాఫ్ట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఆ బాలుడు పేరు రాజా అనిరుద్ధ శ్రీరామ్. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్టు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఔరా! అనిపించాడు. 
 
ఈ బుడతడు ఆరేళ్ళ వయసులోనే కంప్యూటర్ సాధనపై ఆసక్తితో మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్టు పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా... మొక్కవోని దీక్షతో రెండో ప్రయత్నంలో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి పట్టణానికి చెందిన సాకేత్‌ రామ్‌, అంజనా శ్రావణి దంపతుల కుమారుడైన అనిరుధ్ శ్రీరామ్ స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. 
 
కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతూనే, తన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కంప్యూటర్‌పై సాధన చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఎక్సెల్‌ షీట్‌ ఓపెన్‌ చేసి ఏ, బీ, సీ, డీ టైపు చేయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు అందులోని మెళకువలను నేర్పించారు. 
 
ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్టు పరీక్షకు అనిరుధ్‌ సిద్ధమయ్యాడు. నిరంతర సాధనతో స్కోరు క్రమంగా 1000కి 546 నుంచి 950కి మెరుగుపడింది. మొదటి ప్రయత్నంగా ఆగస్టు 14న రాసిన పరీక్షలో విజయం సాధించలేకపోయాడు. రెండో ప్రయత్నంగా ఆగస్టు 21న పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. అనిరుధ్‌ మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్ట్‌ సర్టిఫికేషన్‌ పొందడంతో పాటు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు