ఖాకీల సమక్షంలో పిన్నెల్లి కండకావరం ... టీడీపీ నేత పొట్టలో గుద్దాడు.. వీడియో వైరల్

వరుణ్

శుక్రవారం, 28 జూన్ 2024 (13:56 IST)
ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు అయిన వైకాపా నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కండకావరం ఇంకా తగ్గలేదు. పోలీసుల సమక్షంలోనే ఆయన టీడీపీ నేతపై చేయి చేసుకున్నాడు. మాచర్ల కోర్టు వద్ద తెలుగు యువతు పల్నాడు జిల్లా కార్యదర్శి శివ పొట్టలో గుద్దాడు. దీంతో ఆయనపై మరో కొత్త కేసు నమోదైంది. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మొత్తం నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచి నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. 
 
అయితే, పిన్నెల్లిని అరెస్టు చేసిన తర్వాత పోలీసులు ఆయనను కోర్టుకు తరలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న టీడీపీ నేత శివ పొట్టలో బలంగా గుద్దాడు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 
 
ఐపీసీ 323 సెక్షన్ కింద మాచర్ల పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. అలాగే, టీడీపీ నేతపై దాడి చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
కాగా, మే నెల 13వ తేదీన ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. 
 
దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్‌పై కూడా దాడి చేశారు. అలాగే, ఈ చర్యను ప్రశ్నించిన మహిళను కూడా దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు