రాజధానికి స్విస్ చాలెంజ్ గ్రహణం: హైకోర్టులో మరో పిటిషన్
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (01:46 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తంలో స్విస్ చాలెంజ్ ప్రయోగానికి పూనుకున్నారో కానీ అప్పటినుంచి అది అమరావతికి గ్రహణంలాగా పట్టి పీడిస్తూనే ఉంది. రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్విస్ చాలెంజ్ విధానం మంచి చెడ్డలపై ఇప్పటికే బోలెడన్ని అనుకూల, ప్రతికూల విమర్శలు, అభిప్రాయాలు వస్తూనే ఉన్నాయి. వాటికి తోడు కేసుల కేసులు రావడం ప్రభుత్వానికి అతి పెద్ద తలనొప్పి కలిగిస్తోంది. స్విస్ చాలెంజ్ వి ధానం కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఇచ్చిన జీవో 170కి సవరణ చేస్తూ ఈ ఏడాది జనవరి 2న ప్రభుత్వం జీవో 1ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో 1ను సవాలు చేస్తూ చెన్నైకి చెందిన ‘ఎన్వియన్ ఇం జనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధి కె.శ్రీధర్ రావు న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశా రు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. జీవోలను తన అవసరాలకు అనుగుణంగా మార్చపడేయడంలో అనితర సాధ్యమైన సామర్థ్యం ప్రదర్శించే చంద్రబాబు స్విస్ చాలెంజ్‌నే చాలెంజ్ చేస్తున్న కోర్టు కేసులను చూసి తలపట్టుకుంటున్నారు. రాజధాని నిర్మాణంలో ప్రారంభ ప్రయత్నాలకే ఈ కేసులు గండి కొడుతుండటంతో అయిదేళ్ల పాలన ముగిసేలోగా రాజధాని పనులు ప్రాథమికంగా అయినా ప్రారంభం అవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
‘రాజధానిలో 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి నిమిత్తం సింగపూర్‌కు చెందిన అసెండాస్–సింగ్‌బ్రిడ్జ్– సెంబ్‌కార్ప్ కంపెనీల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడి(ఓపీపీ)గా స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిష నర్ గతేడాది ఆగస్టు 18న టెండర్ నోటిఫికేష న్ జారీ చేశారు. హైకోర్టు జోక్యంతో గడువు తేదీని పెంచడంతోపాటు బిడ్‌ల ప్రక్రియను రెండుగా విభజిస్తూ ఆగస్టు 28న ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ మొత్తం వ్యవహారం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం పలు అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపించారు. రెండు నోటిఫికేషన్ల అమలుపై స్టే విధిస్తూ గతేడాది సెప్టెంబర్ 12న మధ్యం తర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ వేర్వేరుగా రిట్ అప్పీళ్లు దాఖలు చేశాయి. ఏపీ ఐడీఈ చట్టానికి సవరణలు చేస్తున్నట్లు విచారణ సమయంలో అడ్వొకేట్ జనరల్ నివేదించా రు. దీంతో ధర్మాసనం ఈ అప్పీళ్లను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏపీఐడీఈ చట్టానికి పలు సవరణ లు తీసుకొచ్చింది. చట్టంలో రాజీ ప్రక్రియకు ఆస్కారం లేకుండా చేశారు. పోటీతత్వాన్ని నిరోధించి, కొందరికి మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించేందుకు వీలుగా అర్హులైన బిడ్డర్లు అన్న పదాన్ని చేర్చారు.
సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అనుకూలంగా చట్టాన్ని సవరించారు. కన్సార్టియంకు లబ్ధి చేకూర్చేందుకు చట్టంలో సవరణలు చేసిన ప్రభుత్వం, పోటీ ప్రతిపాదనలను ఆహ్వానించడాన్ని నామమాత్రం చేసేసింది. గత నెల 3న తాజా టెండర్లు ఆహ్వానిస్తూ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులో బిడ్డింగ్ ప్రక్రియను రెండంచెల ప్రక్రియగా మార్చింది. మొదట వచ్చిన దరఖాస్తుల్లో బిడ్డర్లకు అర్హతలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. అర్హతలు ఉంటేనే రెండో దశకు ఎంపిక చేస్తారు. ఇది ఏకపక్ష నిర్ణయమే కాకుండా, వివక్షతో కూడుకున్నది కూడా. ఈ నిర్ణయంలో పారదర్శకత లోపించింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఏపీఐడీఈ చట్ట నిబంధనలు వర్తించకుండా చేశారు. కాబట్టి ఇది మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు కానేకాదు. కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మాత్రమే అవుతుంది’’ అని ఎన్వియన్ సంస్థ తన వ్యాజ్యంలో స్పష్టం చేసింది.
‘‘సింగపూర్ కంపెనీల కన్సార్టియం కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం ప్రక్రియను మార్చేసింది. ప్రభుత్వం తన ఇష్టాయిష్టాలకు అనుగు ణంగా వ్యవహరిస్తోంది. అసలు ఇది స్విస్ చాలెంజ్ నిర్వచనం పరిధిలోకే రాదు. ఓపీపీ సుమోటో(తనంతట తాను)గా ప్రతిపాదనలు సమర్పించినప్పుడే అది స్విస్ చాలెంజ్ అవుతుంది. కానీ, ప్రభుత్వం ఇక్కడే ముందే నిర్ణయం తీసుకుని, సింగపూర్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఆ తరువాత ప్రతిపాదనలు స్వీకరించింది. ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు, ప్రజాప్రయోజనాలకు కూడా విరుద్ధం. నిబంధనలు, ఆర్థిక అర్హతలు, ప్రాసెసింగ్ ఫీజులు, బిడ్ సెక్యూరిటీ తదితరాలన్నీ కూడా ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నిర్ణయించింది.
పోటీని వీలైనంత కనిష్ట స్థాయికి తీసుకొచ్చేందుకే ఇలా చేసింది. దేశీయ డెవలపర్లను పోటీ నుంచి తప్పించే దిశగా అర్హతలను నిర్ణయించింది. సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలు, ఆదాయ వాటాను చూడకుండానే గుడ్డిగా ఆమోదించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు ప్లాట్ల అమ్మకాలకు ఉద్దేశించింది. కాబట్టి దీన్ని ఏపీఐడీఈ చట్టం కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు అనలేం. థర్డ్ పార్టీలకు అమ్మేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించినందున ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే అవుతుంది. అర్థిక అర్హతలను కూడా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించింది.
బిడ్డర్ నికర విలువ రూ.2,000 కోట్లు ఉండాలంది. ప్రాజెక్టును 20 ఏళ్లలో మూడు దశల్లో పూర్తి చేయాలంది. దేశీయ డెవలపర్లను పోటీ నుంచి తప్పించేందుకే ఇలాంటి నిబంధనలను నిర్దేశించారు. సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అనుకూలంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాక బిడ్ ప్రాసెస్ ఫీజును రూ.25 లక్షలుగా, బిడ్ సెక్యూరిటీని రూ.6.35 కోట్లుగా నిర్ణయించింది. ఈ బిడ్ సెక్యూరిటీని సింగపూర్ కంపెనీల కన్సార్టియం నుంచి తీసుకున్నారో లేదో ఎక్కడా చెప్పలేదు’’ అని ఎన్వియన్ కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరింది.