జగన్ అలా చేస్తుంటే ప్రజలు చూస్తూ గమ్మునుంటారా? టీడీపీ సీనియర్ నేత ఆలపాటి

మంగళవారం, 23 జులై 2019 (20:32 IST)
ఏపీ అసెంబ్లీ కక్షలు, కార్పణ్యాలకు నిలయంగా మారిందని, ప్రతిపక్ష సభ్యుల్ని అగౌరవపర్చడమే కాకుండా, ప్రజల పక్షాన మాట్లాడే సభ్యుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి పట్టిన దౌర్భాగ్యమంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 
 
పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఎందరో మహానుభావుల్ని అందించిన శాసనసభ జగన్‌ లాంటి వ్యక్తుల్ని చూడాల్సి రావడం తెలుగుజాతి చేసుకున్న పాపమని రాజా మండిపడ్డారు. ఎంతో మంది మహామహులు సేవలు అందించిన శాసనసభ... వైసీపీ నేతలను చూసి సిగ్గుతో తలదించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు తమకు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రజా సమస్యలపై చర్చించి అధికారపక్షాన్ని ప్రశ్నించడం పరిపాటుగా ఉంటుందని, ప్రస్తుతం టీడీపీ ప్రజల పక్షాన నిలబడి  అధికారపక్షాన్ని ప్రశ్నిస్తుంటే ఒర్వలేక టీడీపీ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని వైసీపీ అపహాస్యం చేసిందని ఆక్షేపించారు.
 
సభలో తాము చెప్పిందే నిజం, తాము చేసేందే చట్టం, తాము చెప్పినట్లుగా ప్రతిపక్షం, శాసనసభాపతి సైతం నడుచుకోవాలనే దోరణిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని రాజా మండిపడ్డారు. నేడు వైసీపీ సంఖ్యాబలం చూసుకొని ప్రతిపక్ష సభ్యుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తూ శాసససభ మర్యాదను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తన 3,800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో 600లకు పైగా సమస్యలు నా దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరించే గొప్ప మనసు ఆ దేవుడు నాకు ఇచ్చాడని, మ్యానిఫెస్టోను దేవుడితో సమానమని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఇప్పుడు ఆ దేవుడి మీద నమ్మకం పోయిందా? అని ప్రశ్నించారు. బీసీ,  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 45 ఏళ్లకు పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని అడిగినందుకు టీడీపీ సభ్యుల్ని సభ నుంచి బలవంతంగా బయటకు నెట్టారని, ఇప్పుడు హామీ ఇచ్చిన ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆలపాటి రాజా నిలదీశారు. 
 
రాష్ట్రంలో ప్రతి బిడ్డకు అమ్మఒడి పథకంతో లబ్ధి చేకూర్చుతానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేసి రెండో బిడ్డకు అన్యాయం చేస్తారా? సమాధానం చెప్పాలన్నారు. అమ్మఒడి పథకాన్ని గొప్పగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్‌... ఒక బిడ్డపై ప్రేమ చూపి మరో బిడ్డపై వివక్ష చూపించడం న్యాయమా? అని నిప్పులు చెరిగారు. 
 
కాపుల రిజర్వేషన్‌ల విషయంలో టీడీపీ అన్యాయం చేసిందని, మేం అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఈరోజు కాపు రిజర్వేషన్‌ల అంశంలో ఈబీసీ కోటా నుంచి ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు కూడా తొలగించి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జగన్‌ తనపై ఉన్న అవినీతి బురదను తెలుగుదేశం పార్టీపై చల్లి... లేని అవినీతిని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 
 
గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సైతం మాపై అనేక ఆరోపణలు చేసి వాటిని నిరూపించలేకపోయారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. జగన్‌ చెప్పే మాటలకు చేసే పనులకు చాలా తేడా ఉందని, ఇచ్చిన ప్రతి హామీపై మడమ తిప్పుతున్నారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 55 రోజుల పాలనలో 40 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఏదో గొప్పగా చేస్తామని ప్రకటించి చివరకు ఏం చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్నారని అన్నారు. 
 
అధికారంలో ఉన్న జగన్‌ సమయస్ఫూర్తితో పని చేయాలి కానీ ప్రతిపక్ష సభ్యుల్ని హేళన చేస్తూ సభను నడపాలనుకుంటే ప్రజలు హర్షించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆలపాటి రాజా హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు