విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ను నిర్వహిస్తున్నారు. ఈ బంద్‌కు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. అధికార వైసీపీ కూడా ఈ బంద్‌కు మద్దతు తెలపడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సులు డిపోలకే పరిమితం అవుతాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్న సంగతి తెలిసిందే.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతున్నది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఇక బంద్ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. బంద్‌కు అందరూ సహకరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రోడ్డు మీద బైఠాయించి కార్మికులు నిరసన తెలుపుతున్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యాసంస్ధలు, వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. ఇప్పటికే యోగి వేమన విశ్వ విద్యాలయంలో నేడు జరగాల్సిన మూడేళ్ల, అయిదేళ్ళ ఎల్.ఎ.బీ పరీక్షలను 18వకి వాయిదా వేశారు.
అనంతలోనూ 12 డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు. బస్సులు తిరగకపోవడంతో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. మరోవైపు ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.