ఏపీ రాజధానిగా అమరావతిని ప్రపంచంలోనే గర్వించతగినదిగా చేస్తా అని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ గ్రాఫిక్స్ చూపించారు. అవి కార్యరూపం దాల్చే సరికి ఆయన ప్రతిపక్ష నేత అయిపోయారు. తర్వాత వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని కాదని, మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. అది కూడా కోర్టు చిక్కులతో మళ్ళీ వెనక్కి తీసుకున్నారు.
ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.10 వేల కోట్లు సరిపోతాయని అమరావతి రైతులు చెబుతున్నారని ఆయన తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు విడతల్లో రూ.10 వేల కోట్లు కేటాయించి రాజధానిని నిర్మిస్తాం అని తెలిపారు.
గత సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వాలు అమరావతిని అభివృద్ధి చేయలేదని, తమ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే, అమరావతిని తామే నిర్మిస్తామన్నారు. పెనుగంచిప్రోలు అమ్మవారి సాక్షిగా చెబుతున్నా, అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తాం అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.