ఏపీలో బీజేపీ నేతలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తలపెట్టిన చలో గుడివాడను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజుతో సహా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీనితో కొద్ది సేపు సోము వీర్రాజుకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
సీఎం రమేష్ మాట్లాడుతూ, మమ్ములను ఎందుకు అడ్డుకుంటున్నారు, గుడివాడలో 144 సెక్షన్ ఉందా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనితో చలో గుడివాడ ఉద్రిక్తంగా మారింది. బీజేపీ నేతలు, సోము వీర్రాజు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీర్రాజు సహా పలువురు నేతలు మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడ బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి గుడివాడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు తాము వెళ్తుండగా, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును అడ్డుకున్నారని బీజేపీ నేతలు పోలీసులను విమర్శిస్తున్నారు. ఉంగుటూరు మండలం నందమూరి అడ్డ రోడ్డు వద్ద బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్టు చేశారు. ట్రక్ ఆటోలో ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు సోము వీర్రాజు బీజేపీ నేతలను తరలించారు.
ఏపీలో పోలీసులకు, వైసిపి కార్యకర్తలకు పెద్ద తేడా లేదని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు. తమ అక్రమ అరెస్ట్లతో వైసిపి ప్రభుత్వం ఉద్యమాలను అపలేదన్నారు. అరెస్ట్ చేసిన నేతలను భేషరతుగా విడుదల చేయాలని, మంత్రి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.