పవన్ కళ్యాణ్ ఉన్నదే చెప్పారుగా, మా దోస్తీ ఇలాగే.. కానీ వాళ్ళతో?

బుధవారం, 12 జనవరి 2022 (13:49 IST)
ఏపి ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల పేద ప్రజలు అట్టడుగుకు వెళ్లిపోతున్నారని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

 
అనంతరం ఆలయ వెలుపలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా త్వరగా అంతమవ్వాలని స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు. సామాన్యుడు నేడు ఇసుక, స్టీల్, సిమెంట్ కొనే పరిస్థితిలో లేదని, సినిమా టికెట్లు ధరలు కాదు కనీస నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

 
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, దేశంలోనే ఏ రాష్ట్రానికి ఈ రకమైన పరిస్థితి లేదన్నారు. ఆదాయ వనరులు పెంచే విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని, ఒక చేత్తో ఓటు బ్యాంకుకు తాయిలాలూ వేస్తూ మరో చేత్తో నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్నారని విమర్శించారు. గడిచిన 30 నెలలు రాష్ట్రాన్ని ప్రభుత్వం తిరోగమనం వైపు తీసుకువెళ్లిందని, మరో 30 నెలలు అవకాశం ఉన్న ప్రభుత్వం రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్లాలని కోరారు.

 
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలియచేశారని, కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వన్ సైడ్ లవ్, టు సైడ్ లవ్ అని ఆశలు పెట్టుకున్న వ్యక్తులకు పవన్ నిర్ణయంతో స్పష్టం అయినట్లు తెలుస్తోందన్నారు. 2024లో బిజెపి, జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని, బిజెపి, జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది మా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని విష్ణువర్ధన్‌ రెడ్డి‌ తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు