తుపాను ప్రభావిత జిల్లాల్లో 147.. సహాయక శిబిరాల్లో 10వేల మంది.. శిబిరాల్లో వున్న ప్రతి ఒక్కరికీ రూ.500 తక్షణ సాయం

శుక్రవారం, 27 నవంబరు 2020 (23:00 IST)
ఎపి సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కె. కన్నబాబు మీడియాకు వెల్లడించారు. 
 
1) నివర్ తుపానుకు సంబంధించి కేబినెట్‌లో సమగ్ర చర్చ జరిగింది. తూర్పు గోదావరి నుంచి కడప జిల్లా వరకు పెద్ద ఎత్తున వర్షాలు పడి గత రెండు రోజుల్లో తీవ్ర నష్టం కలిగించాయి. పంటనష్టం, ఆస్థినష్టంతో పాటు నివాసాలు ముంపునకు గురయ్యాయి. తుపాను ప్రభావిత జిలాల్లో 147 సహాయక శిబిరాలను నిర్వహిస్తున్నాం. వీటిల్లో ఇప్పటికే పదివేల మందికి పునరావాసం కల్పించాం. సీఎం వైయస్ జగన్ నిర్ణయం మేరకు పునరావాస శిబిరాల్లో వున్న ప్రతి ఒక్కరికీ తక్షణ సాయం కింద రూ.500 చెల్లించాలనే దానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
 
2) నివర్ తుపాను వల్ల ఇప్పటి వరకు 30వేల హెక్టార్‌లలో వ్యవసాయ, 1300 హెక్టార్‌లలో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. 175 కి.మి. మేరకు రోడ్లు దెబ్బతిన్నాయి. యుద్దప్రాతిపదికన తుపాను సహాయక చర్యలు చేపట్టాలని సీఎంగారు ఆదేశించారు. తపాను వల్ల జరిగిన పంటనష్టంను డిసెంబర్ 15 నాటికి సర్వేను పూర్తి చేయాలి. డిసెంబర్ 31 నాటికి పరిహారం రైతులకు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. 
 
3) పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు, కొన్ని పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారంను కేబినెట్ నిర్ధ్వందంగా ఖండించింది. ప్రాజెక్ట్ ఎత్తు ఒక్క సెంటీమీటర్ కూడా తగ్గించడం లేదని సీఎం ప్రకటించారు. కావాలనే ప్రధాన ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకుని ఎత్తు తగ్గిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయి.  పోలవరం ఒరిజినల్ డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతోంది. స్పిల్ వే పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని కేబినెట్‌లో సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు.

2017లో సీఎంగా చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ఆమోదించే హడావుడిలో 2014 రేట్లను మాత్రమే మేం అంగీకరిస్తామని కేంద్రం చెప్పినా, దానిపై సీఎంగా వుండి చంద్రబాబు అభ్యంతరాలు చెప్పలేదు. దానిపై ప్రతిపక్ష నేతగా శ్రీ వైయస్ జగన్ అప్పుడే స్పందించారు. గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం సరిదిద్దుతోంది.

కేంద్రంతో రాష్ట్రం సంప్రదింపులు జరుపుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, పోలవరం అథారిటీతో రాష్ట్రం సంప్రదింపులు చేస్తోంది.  రూ.29వేల కోట్లు ఆర్ అండ్ ఆర్‌కు, రూ.23 వేల కోట్లు ప్రాజెక్ట్‌కు వ్యయం అవుతోంది. నిధులు తగ్గించడం సరికాదని కేంద్రానికి వివరించాం. కేంద్రం నుంచి ఈ మేరకు సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
 
4) పెన్షనర్లు, ఉద్యోగుల డీఏల చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
పెన్షనర్లకు 3.144 శాతం పెంపు, జులై 2018 నుంచి వర్తింపు, జనవరి –2021 నుంచి చెల్లింపు.
జనవరి, 2019 నుంచి మరో 3.144శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జులై నుంచి చెల్లింపు.
జులై 2019 నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జవరి 2022 నుంచి చెల్లింపు.
 
ఉద్యోగులకు జులై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి నుంచి చెల్లింపు.
జనవరి, 2019 నుంచి 3.144శాతం పెంచిన డీఏను జులై 2021 నుంచి చెల్లింపు.
జులై 2019 నుంచి పెంచిన 5.24శాతం డీఏను జనవరి 2022 నుంచి చెల్లింపు.
 
5) కరోనా సమయంలో మార్చి నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు విత్ హెల్డ్‌లో పెట్టాం. దానిని డిసెంబర్ నెలలో చెల్లించాలని, ఏప్రిల్ లో కోత విధించిన దానిని వచ్చే జనవరిలో చెల్లింపులు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించాం. కోవిడ్ సందర్బంగా ఉద్యోగులకు విధించిన జీతాలు, పెన్షన్‌ల కోత సొమ్మును చెల్లించాలని నిర్ణయించాం. దీనిలో భాగంగా రూ.2324 కోట్లు జీతాలుగా,  482 కోట్లు పెన్షన్లకు ఇవ్వబోతున్నాం.
 
6) నవరత్నాల్లో భాగంగా డిసెంబర్ 25న పేదలందరికీ ఇళ్ళస్థలాల పంపిణీ కార్యక్రమంకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల మందికి ఇవ్వబోతున్నాం. ఇందుకోసం 66,518 ఎకరాలను రూ.23వేల కోట్ల రూపాయలతో సేకరించాం. దానిలో 25,193 ఎకరాలు ప్రభుత్వ భూమి. 22,342 ఎకరాల ప్రైవేటు భూమి వుంది. 
 
7) రాష్ట్రంలో 11వేల పంచాయతీలు వున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇచ్చే ఇళ్ళస్థలాలతో  17,500 కాలనీలు ఏర్పాటవుతున్నాయి. 175 నియోజకవర్గాల్లో ఇళ్ళపట్టాలు ఇవ్వడంతో పాటు 16 లక్షల ఇళ్ళనిర్మాణంను తొలిదశలో చేపట్టే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్ళలో మొత్తం అన్ని ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. 

రూ.1.80 లక్షలు  ప్రభుత్వం ఒక్కో ఇంటికి సాయంగా అందిస్తోంది. తక్కువ రేటుకే సిమెంట్, స్టీల్ అందించేందుకు రివర్స్‌ టెండరింగ్ ద్వారా ఖరారు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. 2022 జూన్ నాటికి తొలివిడత ఇళ్లు పూర్తి చేయాలి. మిగిలిన ఇళ్ళను 2021 డిసెంబర్ లో ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేయాలని నిర్ణయం జరిగింది. ఈ కాలనీలకు విద్యుత్, తాగునీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని సీఎంగారు ఆదేశించారు. 
 
8) వైయస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులపై ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 ఖరీఫ్ సీజన్ పంటల బీమా పథకం కింద నష్టపోయిన రైతులకు రూ.1227 కోట్ల పరిహారంను డిసెంబర్ 15న చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. బీమా కంపెనీల నిబంధనల మేరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఈ మొత్తాన్ని సీఎం గారు బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు ఈ డబ్బును జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. 

పంటల బీమా విషయంలో 2016నుంచి 2019 వరకు మూడేళ్ల కాలానికి 70.71 లక్షల హెక్టార్ల పరిధిలోని 60.84 లక్షల మంది రైతులకు వర్తింప చేశారు. ఇందుకు గానూ ఈ మూడేళ్ళలో రూ.37,457 కోట్లు రైతులకు పరిహారంగా దక్కింది. వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019-20 లో ఒక్క ఏడాదిలోనే 58.77 లక్షల మంది రైతులకు పంటల బీమాను అమలు చేస్తున్నాం. మొత్తం 56.86 లక్షల హెక్టార్ ల భూమికి పరిహారం అందిస్తున్నాం. ఈ ఒక్క ఏడాది పరిహారం కింద రూ.37,721.57 కోట్లు చెల్లిస్తున్నాం.

గత మూడేళ్ళలో బీమా ప్రీమియం కింద రైతులపై రూ.871.26 కోట్లు భారం పడితే, నేడు ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా పథకంను అమలు చేస్తున్నాం. ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతుల పంటకు ఆటోమేటిక్ గా ఇన్యూరెన్స్ వర్తిస్తోంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇన్ని వేల కోట్లు ప్రభుత్వం రైతుల కోసం ఇన్సూరెన్స్ చెల్లింపులు ఎప్పుడూ జరగలేదు. పంటల బీమా పథకం కోసం రాష్ట్రప్రభుత్వమే సొంతంగా ఒక బీమా కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నాటికి ఇది కార్యరూపంలోకి వస్తుంది. 
 
9) ఈ రాష్ట్రంలో పాలవెల్లువ కోసం అమూల్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మహిళల్లో ఆర్థిక స్వావలంభన, సుస్థిర ఆర్థికాభివృద్ది కోసం అమూల్‌తో అనుసంధానంగా పాల ఉత్పత్తి దారుల కార్యక్రమాలు వుంటాయి. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 2 నుంచి అమలు చేయబోతున్నాం. ఏపి అమూల్ ప్రాజెక్ట్ ను సీఎం ప్రారంభించబోతున్నారు. దీనిలో భాగంగా చేయూత, ఆసరా కింద ఎంపికైన లబ్ధిదారులకు ఆవులూ, గెదెల యూనిట్ల పంపిణీ  ప్రారంభిస్తారు.

మొదటి దశలో వైయస్‌ఆర్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని 400 గ్రామాల్లో 9,899 బల్క్ చిల్లింగ్ సెంటర్ లను నిర్మాణం చేయబోతున్నాం. వైయస్ జగన్ పాల ఉత్పత్తిదారులకు లీటర్‌కు  నాలుగు రూపాయలు అదనంగా ధర ఇస్తామని చెప్పారో, దానిని కూడా పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా అమలు చేయబోతున్నాం. డిసెంబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 2.49 లక్షల మేకలు, గొర్రెలను ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తున్నారు.  
 
10) రాష్ట్రంలో నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ జరగాలనే లక్ష్యంతో పశుదాణ ఉత్పత్తి, పంపిణీ నియంత్రణ బిల్లును రేపు అసెంబ్లీలో తీసుకురాబోతున్నాం. కల్తీ చేసినా, నాణ్యత లేకుండా దాణా పంపిణీ చేసిన వారికి జరిమానాతో పాటు జైలుశిక్షను కూడా విధించేలా చట్టంను రూపొందించాలని కేబినెట్‌లో నిర్ణయం జరిగింది. ఎపి ఫిషరీస్ యూనివర్సిటీ చట్టంపై బిల్లును వచ్చే అసెంబ్లీలో తీసుకురాబోతున్నాం. ఫిషరీస్, ఆక్వారంగంలోని నిపుణులను తీసుకురావడానికి, ఈ యూనివర్సిటీ డిగ్రీ, పిజి కోర్స్‌లు నిర్వహిస్తుంది.   
 
11) రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వే ప్రారంభించాలని గత కేబినెట్ లో నిర్ణయం జరిగింది. ఈ మేరకు ఈ సర్వేను డిసెంబర్ 21న సీఎం వైయస్ జగన్ ప్రారంభింస్తారు. వైయస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పథకం కింద దీనికి నామకరణం చేశాం.

సమగ్ర సర్వేలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించుకుంటూ, సర్వే రాళ్ళను కూడా రైతులకు ఉచితంగా ఇస్తూ, వివాదరహితంగా అమలు చేయాలని నిర్ణయం. 2023 వరకు దశల వారీగా సర్వే బృందాల ఆధ్వర్యంలో రీసర్వే నిర్వహణ జరుగుతుంది. వంద సంవత్సరాల తరువాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వే ఇది. దీనికోసం అయ్యే  రూ. 927 రూ.కోట్లు ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
12) యువత గేమింగ్, గ్యాంబ్లింగ్ వల్ల నష్టపోతున్న నేపథ్యంలో దానిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను పటిష్టం చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఎపి గేమింగ్ యాక్ట్ 1974 ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ ను తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టబోతున్నాం.  గేమింగ్, గ్యాంబ్లింగ్ ఆడేవారు, ఆడించేవారిపైన కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్‌లతో శిక్షించేలా చట్ట రూపకల్పన చేస్తున్నాం. 
 
13) అర్భన్ ప్రాంతాల్లోని ప్రాపర్టీ ట్యాక్స్‌ విధింపులో మార్పులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో వున్న ఆస్థిపన్ను విధింపులో శాస్త్రీయత లేదు. దీనితో ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఆస్థిపన్ను విధింపు విధానంను పరిశీలించి అధికారులు ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం నివాసాలకు రిజిస్ట్రేషన్ విలువపై 0.1 నుంచి 0.5 శాతం వరకు, వాణిజ్య, ఇతర నిర్మాణాలకు 0.2 నుంచి 2 శాతం వరకు పన్ను విధిస్తారు.

గతంలో వున్న పన్నులతో పోలిస్తే 15శాతం కన్నా పెరగకుండా కొత్త విధానంలో పన్నులు వుంటాయి.  పేదలు నివసించే బిపిఎల్ కేటగిరిలో వారికి రూ.యాబై మాత్రమే పన్ను విధిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మేరకే పన్నుల విధింపు విధానం వుంటుంది. ఈ పన్నుల రూపంలో వచ్చిన డబ్బును కూడా అర్భన్ లోకల్ బాడీలకే ఇవ్వడం ద్వారా వాటిని ప్రణాళికాబద్దంగా ఖర్చు చేస్తాం. ఇప్పటి వరకు సిఎఫ్ఎంఎస్ విధానంలో అన్నిరకాల జనరల్ ఫండ్స్ జమ అవుతున్నాయి. దానిని డీ లింక్ చేసి ఆస్థిపన్ను ప్రత్యేకంగా అర్భన్ లోకల్ బాడీస్‌కు వెళ్లేలా నిర్ణయం జరిగింది. 
 
14) ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ లకోసం ప్రత్యేక కార్పోరేషన్‌ను  యుఐపిడిసిఎల్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు, ఎపి పల్నాడు ఏరియా డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరుతో ఒక ఎస్పీవిని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం. దీనిలో బాగంగా గుంటూరు చానెల్ ఎక్స్‌టెన్షన్ స్కీం, వైయస్‌ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు వుంటాయి. కృష్ణా-కొల్లేరు సెలినిటీ మిటిగేషన్ ప్రాజెక్ట్‌ కార్పోరేషన్ ను కూడా ఎస్పీవిగా కొల్లేరుపై నాలుగు రెగ్యులేటర్లు, కృష్ణనదిపై మూడు నిర్మాణాలు వస్తాయి. డ్యాం రిహ్యాబిలిటేషన్ ఇంప్రూమెంట్ ప్రాజెక్ట్ ఫేస్ - టు, త్రీ కి కేబినెట్ ఆమోదం.

సోమశిల కండలేరు కాలువ సామర్థ్యంను పన్నెండు నుంచి 24వేలకు పెంచే పనులకు వచ్చిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది. దీనిలో 45 కి.మి. కాలువ పనులు, కొన్ని వంతెనల నిర్మాణం వుంటుంది. రూ.918 రూ.కోట్లు దీనికి ఖర్చు చేయబోతున్నాం. అనంతపురం చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్‌లో పది టిఎంసిల నిల్వ, ముంపు బాధితులకు సహాయ పునరావాసం గా రూ. 240.53 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలుగు గ్రామాల పరిధిలోని 1729 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తాం. 

ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ నార్త్ ఫీడర్ చానెల్ కెనాల్ విస్తరణకు ఆమోదం తెలిపింది. దాదాపు వంద కి.మి. కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి రూ.632 కోట్లు ఖర్చు అవుతుందనే అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
15) వైయస్‌ఆర్ కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లో కొత్తగా వచ్చే పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే దానిపైనా చర్చ జరిగింది. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. టిడ్కో ఇళ్లు కూడా రూపాయికే ఇవ్వాలని సీఎంగారు గతంలో నిర్ణయించారు. దానికి కూడా త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు