గర్భవతిగా వచ్చి చిన్నారితో ఇంటికి... బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన మహిళా ఖైదీలు

శుక్రవారం, 27 నవంబరు 2020 (22:48 IST)
మహిళా జీవిత ఖైదీలు విడుదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదల అవుతున్నారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం(రాజమండ్రి) సెంట్రల్‌ జైల్‌ నుంచి 19 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదలయ్యారు.

కొన్ని పూచీ కత్తులపై రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల విడుదలకు మార్గం సుగుమం చేసిన విషయం తెలిసిందే. శిక్షా కాలం పరిమితి ముగిసే వరకూ ప్రతీ మూడు నెలలకు ఒక సారి పోలీస్‌ స్టేషన్‌లో హాజరు కావాలి.బయటకు వెళ్ళిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా మళ్ళీ వెంటనే అరెస్ట్‌ చేసి ముందుస్తూ విడుదల రద్దు అవుతుంది.

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ నుంచి 19 మంది విడుదల కాగా వారిలో నలుగురు డీగ్రీ చదివినవారు ఉండగా, ఇద్దరు ఎం.ఎ పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. సెంట్రల్‌ జైల్‌ నుంచి ప్రత్యేకంగా మహిళా ఖైదీలు మాత్రమే విడుదల కావడం రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటి సారి కావడంతో ఖైదీల కుటుంబాలలో ఆనందాలు వెల్లువెత్తాయి. తమ కుటుంబాలతో గడిపే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఖైదీల కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.

విడుదలైన మహిళలకు ఎంపీ మార్గాని భరత్ రామ్ నిత్యావసరాలు ,దారి ఖర్చులు అందించగా, చిన జీయర్ ట్రస్ట్ కుట్టుమిషన్లు, చందనా బ్రదర్స్‌ నిర్వాహకులు చందనా నాగేశ్వర్‌ మహిళలకు చీరలు అందచేశారు.

గర్భవతిగా జైలుకు వచ్చి పసిబిడ్డతో విడుదల...
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లో ఒక మహిళా ఖైదీ గర్భవతిగా జైలుకు వచ్చింది. శిక్ష అనుభవిస్తూ అక్కడే పురుడు పోసుకుంది. ఆమెకు జన్మించిన పాపకు ప్రస్తుతం నాలుగేళ్లు. పసి పాపతోనే ఆ మహిళ జైలులో డిగ్రీ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా క్షమాభిక్ష ప్రసాదించడంతో తల్లి బిడ్డ శుక్రవారం విడుదల అయ్యారు. మహిళా జైలులో ఖైదీలకు టైలరింగ్, కవర్లు తయారీ, బేకరీ, తదితర వృత్తులలో శిక్షణ ఇచ్చారు.
 
ఇక ఖైదీలు విడుదలైన అనంతరం వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు, పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు సంస్ధల సహకారం తో మహిళా ఖైదీలకు నూతన వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జైల్‌ అధికారులు తెలిపారు. కాగా విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు మహిళ ఖైదీలు విడుదల అయ్యారు.

విడుదలైన మహిళా ఖైదీలు గల్లేలా కాంతమ్మ (శ్రీకాకుళం జిల్లా) నీలపు రోజా (విశాఖపట్నం). సీఎం జగన్‌ మహిళ ఖైదీల విషయంలో మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
 
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగష్టు 15ను పురష్కరించుకుని జీవో నెంబర్‌ 131ని విడుదల చేసింది.ఈ జీవోకు అనుగుణంగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ పరిధిలో ఉన్న మహిళా జైలు నుంచి 19 మంది విడుదలకు మార్గం సుగమం అయ్యింది. వాస్తవంగా సత్పవర్తన కల్గిన ఖైదీలను ఆగష్టు 15నే విడుదల చేయాల్సివుంది.

అయితే కరోన వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని నాడు విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు క్షమాభిక్షతో సత్పవర్తన కలిగిన జీవిత ఖైదీలను శుక్రవారం విడుదల చేసింది. విడుదలైన మహిళా ఖైదీలు తమ కుటుంబాలను కలుసుకోవడంతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వద్ద కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
 
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు పరిధిలోని మహిళా జైలు నుంచి జీవిత ఖైదీలు సత్పవర్తన జాబితాలో ప్రభుత్వం కల్పించిన క్షమాభిక్ష జాబితాలో ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పుష్కరించుకుని విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్‌ 131 విడుదల చేసింది. విడుదలైన ఖైదీల జీవిన భతికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. శిక్ష అనుభవిస్తున్న తరుణంలో జైలు సంస్కరణల నేపథ్యంలో ఖైదీలు తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా వివిధ రకాల శిక్షణలు కల్పించడం జరిగింది.

విడుదలైన వారందరికీ వారి వారి పరిస్థితిని బట్టి ప్రభుత్వ పథకాలతో ప్రోత్సహాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మహిళా ఖైదీలు శిక్ష అనుభవించే కాలంలో టైలరింగ్‌ వృత్తిలో శిక్షణ తీసుకున్నారు.

సత్పవర్తనతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షతో విడుదలైన 19 మంది మహిళలకు శ్రీశ్రీశ్రీ త్రిదండ చిన్న జియర్‌ స్వామి ట్రస్ట్‌ ఔధార్యంతో కుట్టు మిషన్లను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు, మహిళా జైలు సూపరింటెండెంట్‌ కె.కృష్ణవేణి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

క్షమాభిక్షతో విడుదలైన సత్పవర్తన కలిగిన ఈ ఖైదీలకు స్వచ్ఛంధ సేవా సంస్థకు చెందిన ప్రతినిధులు చీరలు పంపిణీ చేశారు. అలాగే రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ ఆర్థిక సహాయంతో జైలు నుంచి విడుదలైన 19 మంది మహిళా ఖైదీలకు నెల రోజులపాటు సరిపడే నిత్యావసర వస్తువులతోపాటు, వారి వారి స్వగృహాలకు చేరుకునేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.500 చొప్పున నగదును అందించారు. 
 
విడుదలైన మహిళా ఖైదీల్లో ప్రధానంగా వరకట్న కేసుల్లో శిక్ష అనుభవించినవారున్నారు. సుమారు డెబ్బై ఏళ్ళు పైబడి జీవిత చరమాంకానికి వచ్చిన ఖైదీలు కొంత మంది ఉన్నారు. వీరంతా సత్పవర్తనతో ఎట్టకేలకు విడుదలయ్యారు. కష్జారామా అంటూ జీవిత చరమాంకాన్ని పూర్తి చేస్తామని, విడుదలై తమ కుటుంబాలను ఈ పరిస్థితులోనైనా కలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని మహిళా వయోవద్ధ జీవిత ఖైదీలు అభిప్రాయపడ్డారు. 
 
జైలులో వివిధ రకాల శిక్షణ తీసుకున్న మహిళా ఖైదీల్లో ఇద్దరు పీజీ చేయగా, మరో ఇద్దరు డిగ్రీ పట్టాను అందుకున్నారు. క్షణికావేశంలో చేసిన సంఘటనల్లో శిక్ష పడి జైలుకు వచ్చిన వీరు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా పిజీ, డిగ్రీలు జైలు లోనే చేసి విద్యా వంతులుగా విడుదల అయ్యారు. విడుదలైన తర్వాత తమ కాళ్ళపై తాము నిలబడే ఆత్మస్థైర్యం వచ్చిందని, జైలులో ఏదో పని నేర్చుకున్నామని పలువురు మహిళా ఖైదీలు అన్నారు. .

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు