పీడీ అకౌంట్లపై బాబు కౌంటర్.. ఇచ్చిన మాట తప్పారంటూ ఫైర్

బుధవారం, 15 ఆగస్టు 2018 (14:52 IST)
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు ఏకరువు పెట్టారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. గర్భంలో ఉన్నప్పటి నుంచి మరణించేంతవరకు ప్రతి ఒక్కరికీ, ప్రతి దశలోనూ ఒక్కో రకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు చంద్రబాబు గుర్తు చేశారు. 
 
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా ఎన్నో అమలు చేసినట్టు బాబు తెలిపారు. నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ఘనతలో ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. అందుకే జీతాలు పెంచి వారి బాధలు తీర్చామన్నారు.
 
అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత సహాయ నిరాకరణ చేస్తోందన్నారు. కేంద్రం మొత్తం 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో కొన్నిమాత్రం ఏర్పాటు చేసిందని, వాటికి కూడా నిధులు అరకొరగా ఇస్తోందన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో 10.5శాతం వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటేనని చెప్పారు. రైతులకు రూ.24000 కోట్ల రుణవిముక్తి, డ్వాక్రా సంఘాలకు రూ.10,000 కోట్ల ఆర్థిక సాయం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. 
 
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 1500 రోజుల్లో ఎవరికి ఏం చేశామో, అన్ని లెక్కలు బయటపెడతామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాలు, నిధుల విషయంలో దాపరికం ఏదీ లేదని స్పష్టం చేశారు. పీడీ అకౌంట్లపై బీజేపీ ఆరోపణలకు ప్రభుత్వం తరఫున పరోక్షంగా చంద్రబాబు కౌంటరిచ్చారు. 
 
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని, కుంటిసాకులు చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తే..ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు సంబంధించిన డబ్బులు కూడా తిరిగి రాలేదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు