ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలపై మోదీ ప్రశంసలు 12 ఏళ్ల నీలగిరి పువ్వుల్లా?

బుధవారం, 15 ఆగస్టు 2018 (10:38 IST)
దేశ వ్యాప్తంగా 72వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతం ప్రధాని మోదీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ బాలికలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రధాని అన్నారు. 
 
సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరంగా శ్రమిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందన్నారు.  12 ఏళ్లకు ఓసారి పుష్పించే నీలగిరి పువ్వుల్లా దేశం వికసిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. మన బాలికలు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆత్మవిశ్వాసాన్ని నలుదిశలా చాటారని కొనియాడారు.
 
అయితే దేశంలో ఈసారి వానలు పుష్కలంగా పడుతుండటం ఆనందాన్నిచ్చినా.. మరోవైపు వరదలు ముంచెత్తడం బాధగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణలో త్రివిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయన్నారు. 
 
దేశ ప్రజలందరి తరపున త్యాగధనులందరికీ ప్రమాణం చేస్తున్నానన్నారు. దేశం ఈ రోజు గరిష్ఠ స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తోందని మోదీ వివరించారు. వీటితోపాటు మొబైల్ ఫోన్లనూ భారత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. మంగళయాన్ విజయంతో మన శాస్త్రవేత్తల కృషిని ప్రపంచానికి చాటామని, మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టి కలలను సాకారం చేసి చూపించాల్సి ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు