పవన్ కళ్యాణ్ దాతృత్వాన్ని మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

ఠాగూర్

గురువారం, 5 సెప్టెంబరు 2024 (11:24 IST)
భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాల బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ అనే తేడా లేకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకంగా రూ.6 కోట్ల భారీ విరాళంతో ఉదారత చాటారు. ఇందులో తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.కోటి ప్రకటించిన జనసేనాని.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ.కోటి ఇచ్చారు.
 
అలాగే ఏపీలో వరద బారినపడిన 400 గ్రామ పంచాయితీలకు రూ.లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇలా విపత్కర పరిస్థితుల్లో గొప్ప మనసు చాటిన పవన్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వరద ప్రాంత ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎంను అభినందించారు.
 
ఈ మేరకు 'ఎక్స్' ట్విట్టర్ వేదికగా పవన్‌ను ప్రశంసిస్తూ చంద్రబాబు పోస్టు పెట్టారు. వరదల కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు భారీ విరాళం ఇవ్వడం జనసేనాని విశాల హృదయానికి అద్దం పడుతుందన్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేమన్నారు. 
 
'వరద ప్రాంత ప్రజల కోసం ఎంతో ఉదాత్తంగా భారీ విరాళం ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌కు నా అభినందనలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి, వరద బారినపడిన 400 పంచాయితీలకు రూ.4 కోట్లు, తెలంగాణ వరద ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలు చేసేందుకు మరో రూ.కోటి ఇవ్వడం ఆయన విశాల హృదయానికి అద్దం పడుతుంది.
 
దాతృత్వాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా ప్రవర్తించే పవన్ కల్యాణ్ సమాజంలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. అదేవిధంగా ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు. ఆయనకు మరో సారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని సీఎం చంద్రబాబు తన ట్వీట్లో రాసుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు