టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో వైకాపా నేతలకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ను వైకాపా నేతలకు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రెండు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైకాపా నేతలు ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై ఇవాళ బుధవారం హైకోర్టు నిర్ణయం వెలువరించింది. వైకాపా నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడికేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు.
మరోవైపు, హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో వైకాపా నేతల అరెస్టుకు రంగం సిద్ధమైంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు బుధవారం సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులు వస్తున్నట్టు ముందుగానే తెలుసుకున్న సురేష్ ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.