ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తో గౌరవ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు భారతీ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు గవర్నర్ దంపతులు సుప్రవ హరిచందన్, బిశ్వ భూషణ్ హరిచందన్ లతో సమావేశం అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబరు ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా నిర్వహించే ప్రతిష్టాత్మకంగా వైఎస్ ఆర్ జీవిత సాఫల్య, వైఎస్ ఆర్ సాఫల్య పురస్కారాల ప్రధానోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గవర్నర్ ను కోరారు. ఇందుకు అంగీకరించిన గవర్నర్ పురస్కారాల ప్రధానోత్సవ వివరాలను, ఎంపిక విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమకాలీన రాజకీయ అంశాలను గురించి గవర్నర్ కు వివరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యక్రమల సమన్వయకర్త తలశిల రఘురామ్, గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ , గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.