ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ

శనివారం, 22 మే 2021 (23:33 IST)
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసారు ముఖ్యమంత్రి.
 
ముఖ్యమంత్రి లేఖలోని ప్రధాన అంశాలు.
 
– కోవిడ్‌–19ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు. 
– రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించాము. 
– అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్‌ల టీకాలు పూర్తి చేసే ప్రక్రియలో ముందుకు వెళ్తున్నాము.
– మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్‌ వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చన్న కేంద్ర నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తోంది.
– వాక్సిన్ల ధరల్లో తేడాలు, ఏ రేటుకు వాక్సిన్‌ వేయాలన్న దానిపై ఆయా ఆస్పత్రులకు వెసలుబాటు ఉండడంతో, కొన్ని ఆస్పత్రులు ఒక్కో డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి.
– ఇది ప్రజలపై భారం వేయడమే కాకుండా, వారి విమర్శలకు దారి తీస్తోంది. నిజానికి కోవిడ్‌ వాక్సిన్లు ప్రజలకు ఉచితంగా అందించాల్సి ఉంది. అలా వీలు కాకపోతే నామమాత్ర ధరలో టీకా వేయాలి.
– 45 ఏళ్లు దాటిన వారికే రెండు డోస్‌ల వాక్సిన్‌ వేయడానికి సరిపడా సరఫరా ఇప్పుడు లేదు. 
– ఇలాంటి పరిస్థితుల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడం వచ్చే కొన్ని నెలల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
– ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కోవిడ్‌ వాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరి కాదు. వాక్సిన్లు సేకరించే ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారం ధరలకు టీకాలు వేసే అవకాశం ఉంది.
– ఇది పేద ప్రజలను వాక్సిన్‌కు దూరం చేయడమే కాకుండా, డిమాండ్‌ పెరగడంతో వాక్సిన్ల బ్లాక్‌ మార్కెట్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించడం కూడా కష్టమవుతుంది.
– ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వాక్సిన్‌ వేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించడం అన్నది మంచి ఆలోచనే అయినా, అవసరానికి మించి వాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పుడే అది సబబు అవుతుంది.
– వాక్సిన్‌ విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ఖర్చు చేయగలిగిన స్థోమత ఉన్న వారు తమకు ఇష్టం ఉన్న ఆస్పత్రికి వెళ్లి వాక్సిన్‌ వేయించుకుంటారు. 
– కానీ డిమాండ్‌ కంటే చాలా తక్కువగా ఇప్పుడు వాక్సిన్‌ ఉత్పత్తి అవుతోంది.
– ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వాక్సిన్‌ కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు ప్రజల నుంచి ఇష్టానుసారం ఛార్జీ వసూలు చేసే అవకాశం ఏర్పడింది.
– కాబట్టి, ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాను. 
– దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్‌ డోస్‌లు వేసే వీలు కలుగుతుంది.
– ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్‌ బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నాను అని సీఎం శ్రీ వైయస్‌ జగన్, ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి లేఖ రాశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు