సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య దూరం ఏర్పడిందని చాలా రోజుల క్రితం రాజకీయ ఊహాగానాలు వచ్చాయి. అవి కొంత వరకు నిజమేనని అప్పటి నుంచి జరిగిన కొన్ని పరిణామాల వల్ల తేలింది. ఆయన్ని అమరావతికి గాని, తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు గాని రాకుండా, మొత్తం ఢిల్లీలోనే ఉంచేశారనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీనికి తగినట్లే, ఎంపీ విజయసాయి, సీఎం జగన్ వ్యక్తగత పర్యటనలకు, ఇడుపులపాయ పర్యటనలకు కూడా దూరం అయ్యారు.
అయితే, ఇపుడు ఢిల్లీలో కూడా ఎంపీ విజయసాయి సీఎం జగన్ కి దూరం అయిపోయారనే ప్రచారం జరుగుతోంది. వారిద్దరి మధ్య దూరం మరింత పెరగిందంటున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో స్పష్టంగా కనిపించిన గ్యాప్ కనిపించిందంటున్నారు. ఢిల్లీ టూర్ లో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం కనిపించలేదంటున్నారు. సీఎం జగన్ విజయసాయితో ముఖాముఖి ఎక్కడా మాట్లాడలేదని, రాత్రి డిన్నర్ కు కూడా విజయసాయిరెడ్డిని దూరంపెట్టారని చెపుతున్నారు. కేంద్ర మంత్రి సింధియాతో మీటింగ్ లోనూ విజయసాయిరెడ్డిని బయటకు పంపారనే వార్తలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర నేతల అపాయింట్ మెంట్లు కూడా సరిగా ఫిక్స్ చేయలేకపోవడంపై విజయసాయిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీలు వేమిరెడి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డిలకే సీఎం జగన్ ప్రాధాన్యం ఇచ్చారని చెపుతున్నారు. ఢిల్లీ వ్యవహారాలను నడిపిస్తున్న వేమిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి అంతా సమన్వయం చేశారని సమాచారం. రాష్ట్రంలోనూ సాయిరెడ్డి ప్రాధాన్యానికి ఎపుడో కళ్లెం వేశారు. ఉత్తరాంధ్ర వ్యవహారాల నుంచి సాయిరెడ్డిని పక్కన పెట్టిన జగన్, ముఖ్య బాధ్యతలను సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనే పెట్టారు. ప్రెస్ మీట్లు, ఉద్యోగ సంఘాలతో చర్చలు చూస్తున్నది సజ్జలనే. అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గించడం కనిపిస్తోందని చెపుతున్నారు.