నేడు క్లీన్ ఆంధ్రప్రదేశ్ - జగనన్న స్వచ్ఛ సంకల్పంకు శ్రీకారం

శనివారం, 2 అక్టోబరు 2021 (11:31 IST)
పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుడుతోంది. గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన 'క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)-జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 
 
4,097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపిప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధానలక్ష్యం. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 
 
గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్‌కిన్స్, సూదులు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్‌) చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్‌ బిన్‌ల చొప్పున క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల్లో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 123 కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్‌ బిన్‌లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు