ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన 13 జిల్లాలను 26 జిల్లాలుగా వేరు చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగా అరకు నియోజకవర్గం విస్తీర్ణం దృష్ట్యా రెండు జిల్లాలుగా విడిపోనుంది. ఇందులోభాగంగా, ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిపై ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ స్పందించారు.
కొత్త జిల్లాల ఏర్పాట్లపై అభ్యంతరాలు స్వీకరణకు మార్చి 3వ తేదీ తుది గడువు అని వెల్లడించారు. ఇప్పటివరకు రాయలసీమ ప్రాంతం నుంచి 1,600 అభ్యంతరాలు అందాయని అన్నారు. ఈ అభ్యంతరాలను ఉన్నత స్థాయి కమిటి పరిశీలిస్తుందన్నారు. అన్ని అంశాలను పరిశీలించి, సమీక్షించి జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.