ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో రచ్చ జరుగుతుంటే.. ఇక్కడ రచ్చ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్... ఢిల్లీకి పోకుండా ఇక్కడ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. మూడు నెలలకోసారి వచ్చి బురద జల్లుడు కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు. తమిళనాడులో ఉండే సినీ తరహా రాజకీయాలు ఏపీలో చెల్లవని, ఏపీలో అదే తరహా రాజకీయాలు చేద్దామనుకుని గతంలో చిరంజీవి బొక్కబోర్లా పడ్డారని మంత్రి గుర్తు చేశారు. పోలవరంలో జరిగిన అవినీతేంటో పవన్ చెప్పాలన్నారు. ఆధారాలతో అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే చర్యలు తీసుకునే ధైర్యం మా ప్రభుత్వానికి ఉందన్నారు.
సరైన ఆధారాలు లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ మా మీద విమర్శలు చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం, టీడీపీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇమేజ్ నాశనం అయిందన్నారు. ఏమాత్రమైనా ఇంగితజ్ఞానం ఉంటే పవన్ అలా మాట్లాడి ఉండేవారు కాదు. అధికారంలో లేని రాజకీయ నిరుద్యోగుల దగ్గర సలహాలు తీసుకుంటే పవన్ కళ్యాణే నష్టపోతారన్నారు.
ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్ ఇప్పుడు మాట మారుస్తున్నారని మంత్రి విమర్శించారు. రాష్ట్రానికి ఏమైనా మేలు చేయాలనుకుంటే ఢిల్లీ వెళ్లి చేయాలని మంత్రి సూచించారు. నిధులు ఇవ్వడం లేదు కాబట్టే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని, రాష్ట్రాన్ని మరింత ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరించే అవకాశం లేకపోలేదన్నారు.