ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు టార్గెట్ చేశారు. ఆయన అవినీతికి ప్రత్యేకించి సాక్ష్యాధారాలు అవసరం లేదనీ, ఆయన అవినీతి బహిరంగంగా ప్రతి ఒక్కరి కళ్ళకు కనిపిస్తోందన్నారు.
ఆయన శనివారం జాతీయ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. విభజన హామీ మేరకు నిర్మతమవుతున్న పోలవరం ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును... ప్రైవేట్ కాంట్రాక్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిందని, ఇందులోనూ అవినీతి జరిగిందన్నారు.
ఇకపోతే, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి పని చేసే అవకాశమే లేదన్నారు. ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ... ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ పూర్తిగా కోల్పోయిందని... ఏపీలో బీజేపీ ఇమేజ్ పూర్తిగా నెగెటివ్‌గా ఉందని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎవరూ భావించడం లేదని, అలాంటపుడు తానెందుకు ఆ పార్టీతో జట్టు కడతానని తెలిపారు.