తన ప్రస్తుత పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదని పవన్ స్పష్టం చేశారు. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నానని తెలిపారు. ఈ పర్యటన "ఇది నా వ్యక్తిగతం. నాలుగున్నర సంవత్సరాల క్రితం నేను చేసిన కొన్ని మొక్కులను, ప్రమాణాలను నెరవేర్చుకోవడానికి వచ్చాను" అని పవన్ అన్నారు. ఆరోగ్య సవాళ్లు ఉన్నప్పటికీ, తీర్థయాత్ర చేపట్టాలని తాను దృఢంగా నిర్ణయించుకున్నానని పవన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి దర్శనానికి కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు. అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదనేదే తన ఆవేదన అంటూ పవన్ అన్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. లడ్డూ ప్రసాదం కల్తీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేయడం హర్షణీయమని పవన్ పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదని.. భవిష్యత్తులో కూడా టీటీడీ ఆలయ సాంప్రదాయాలను కాపాడటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. ఇకపోతే.. పవన్ కల్యాణ్ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన కుమారుడు అకిరా నందన్, సన్నిహితుడు, టిటిడి బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.