ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో మరో 1,610 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
కొత్తగా ఏర్పాటయ్యే 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1,232 పోస్టులు, ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న మరో 63 పీహెచ్‌సీల్లో 378 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో డాక్టర్, హెల్త్ సూపర్ వైజర్ పోస్టులు ఉన్నాయని ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులను జిల్లాల వారీగా నియామకం చేపడుతామని ఆయన వెల్లడించారు.