ఏపీ నుంచే ఇంజనీరింగ్ పట్టభద్రులు వస్తున్నారు : గవర్నర్ హరిచందన్
శుక్రవారం, 26 జులై 2019 (15:44 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషన్ హరిచందన్ అన్నారు. ప్రతి ఒక్కరికీ ఈ తరహా అవకాశాలు దక్కేలా ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్త వహించాలన్నారు. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఏపీ నుండి బయటకు వస్తున్నారని, వారు నిరుద్యోగ సమస్యను ఎదుర్కోకుండా చూడవలసిన బాధ్యత పాలకులపై ఉందని స్పష్టం చేసారు.
శుక్రవారం రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై గవర్నర్ సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూధన రెడ్డి, సీఈఓ డాక్టర్ అర్జా శ్రీకాంత్‌తో కలిసి గవర్నర్ కార్యదర్శి ముఖష్ కుమార్ మీనా తొలుత రాష్ట్రంలో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, పారిశ్రామిక ప్రగతి ఏలా ఉంది, ఐటి పరిశ్రమ ఏ తీరుగా ఉంది వంటి అంశాలపై ప్రశ్నించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ఇప్పటివరకు మరే ఇతర శిక్షణ కార్యక్రమాలు అందుకోలేని గిరిజన యువతను లక్ష్యంగా చేసుకుని తాము శిక్షణ అందించామని వారిలో ఎక్కువ మంది ఉపాధిని అందుకోగలిగారని గవర్నర్‌కు వివరించారు.
సాంకేతిక నైపుణ్యం లేని సాధారణ యువత విదేశాలలో స్థిరపడేలా ఓవర్సీస్ మాన్ పవర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సమైఖ్య రాష్ట్రం దేశంలోనే అతి పెద్ద ఐటి ఎగుమతుల హబ్‌గా ఉండేదని, విభజనతో అది కనిష్ట స్థాయికి పడిపోయిందని వివరించారు.
నైపుణ్యాభివృద్ది సంస్ధ ఛైర్మన్ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని, పారిశ్రామిక ఉపాధి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతం అయ్యిందని, ఈ పరిస్ధితిని చక్క దిద్దేందుకు యువ ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని గవర్నర్ విన్నవించారు.
ఈ నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ ఆగస్టులో తాను స్వయంగా ఒక నైపుణ్యాభివృద్ది సంస్థను సందర్శించి విద్యార్ధులు, నిరుద్యోగ యువతతో మాట్లాడతానని ఇందుకు అవసమైన ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి మీనాను అదేశించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయిక్త కార్యదర్శి అర్జునరావు, నైపుణ్యాభివృద్ది సంస్థ ఇడి డాక్టర్ బి.నాగేశ్వరరావు, చీఫ్ జనరల్ మేనేజర్ సత్య ప్రభ, కంపెనీ కార్యదర్శి జివి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.