ఏపీ సర్కార్ కీలక నిర్ణయం : కొత్త జిల్లాల ఏర్పాటుకు సబ్ కమిటీలు

శనివారం, 22 ఆగస్టు 2020 (18:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం నాలుగు సబ్ కమిటీలని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. 
 
ఏపీలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి సబ్‌ కమిటీలతో పాటు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
మొత్తం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను ఓ కమిటీకి, సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను మరో కమిటీకి అప్పగించారు.
 
అలాగే, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం బాధ్యతలు మూడో కమిటీకి, సాంకేతిక సంబంధిత అధ్యయన బాధ్యతలను నాలుగో కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్‌ కమిటీలకు అవసరమైన సాయం చేయడం కోసం కలెక్టర్‌ ఛైర్మన్‌గా పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు