హైకోర్టులో మంత్రి కొడాలి నానికి ఊరట.. మీడియాతో మాట్లాడొచ్చంటూ..

గురువారం, 18 ఫిబ్రవరి 2021 (12:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. కొడాలి నానిపై ఎస్‌ఈసీ విధించిన ఆంక్షలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వ పథకాల గురించి మీడియాతో కొడాలి నాని మాట్లాడవచ్చని పేర్కొంది. ఎన్నికల కమిషన్‌, ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే విధంగా కొడాలి నాని మాట్లాడకూడదని హైకోర్టు సూచించింది.
 
కాగా, ఇటీవల మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కమిషనర్‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
దానిపై మంత్రి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ నెల 21వరకు మీడియాలోగానీ, సమావేశాలలో గానీ మాట్లాడకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌  ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మంత్రి కొడాలి నాని శనివారం హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు.
 
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజుల ముందు విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.... 'ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం. మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి, సాయంత్రంలోపు వివరణ ఇవ్వమన్నారు. రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం ఉంది... ఎన్నికల సంఘం స్థాయిని తగ్గించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు... అని పిటిషనర్‌ వివరణ ఇచ్చారు. ఈ వివరణను ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇచ్చింది' అని పేర్కొన్నారు. 
 
అయితే, ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ... 'షోకాజ్‌ నోటీసుతో పాటు ఆధారాలను పిటిషనర్‌కు పంపాం. మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ఫుటేజ్‌ను పరిశీలించాలి' అని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
 
ఎస్ఈసీ తరపు న్యాయవాది వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... మీడియా సమావేశంలో పిటిషనర్‌ మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను, అందులోని అంశాలను రాతపూర్వకంగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఫుటేజ్‌లోని వివరాలను పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ ఫుటేజీలను పరిశీలించిన కోర్టు.. నానికి ఉపశమనం కలిగిస్తూ ఉత్తర్వులిచ్చింది.1

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు