స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబు ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఆయనకు ఈ దశలో బెయిల్ ఇవ్వరాదని కోర్టును కోరారు.
సీఐడీ వాదనల పట్ల హైకోర్టు ధర్మాసనం స్పందించింది. నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని హైకోర్టు అభిప్రాయపడింది. అదేసమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు స్పందించారు. చంద్రబాబు పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్టు ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దాంతో హైకోర్టు కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులతో ఏకీభవించింది.
ప్రతి సబ్ కాంట్రాక్టర్ తప్పులకు ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయలేమన్నారు. ఉల్లంఘనలపై అధికారులు ముఖ్యమంత్రికి చెప్పినట్టు ఆధారాలు లేవని తెలిపారు. స్కిల్ వ్యవహారంలో దర్యాప్తు మొదలయ్యాక చంద్రబాబు 22 నెలలు బయటే ఉన్నారని ధర్మాసనం వెల్లడించింది. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం కూడా లేదు కదా అని వాఖ్యానించింది.
చంద్రబాబుపై కొన్నిరోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వెల్లడించింది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్‌జీ భద్రతలో ఉన్నారని, అలాంటి వ్యక్తి కేసు విచారణ నుంచి తప్పించుకుంటారా? అని ప్రశ్నించింది. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగిస్తారన్న వాదనలను తాము అంగీకరించబోమని హైకోర్టు స్పష్టం చేసింది.
సీమెన్స్ కంపెనీ డైరక్టర్, డిజైన్ టెక్ యజమాని వాట్సాప్ సందేశాలకు, చంద్రబాబుకు ఏమిటి సంబంధం? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సీఐడీ న్యాయవాది స్పందిస్తూ, సీమెన్స్‌తో ఒప్పందంలో సుమన్ బోస్ పేరుతో సంతకం ఉందని వెల్లడించారు. అందుకు కోర్టు బదులిస్తూ... ఒప్పందాల్లో సంతకాలు పరిశీలించే బాధ్యత ముఖ్యమంత్రిది కాదన్నారు. సంతకాలపై అభ్యంతరాలు ఉంటే తేల్చడానికి ఫోరెన్సిక్ విభాగం ఉందని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పేందుకు ఆధారాలు లేవని హైకోర్టు వివరించింది.