ఇంటర్మీడియట్ అడ్మిషన్లను ఆన్‌లైన్ విధానంలో చేపట్టాలని ఏపీ సర్కారు భావించింది. అయితే హైకోర్టులో ఏపీ సర్కారుకు చుక్కెదురైంది. అందుకు కోర్టు అంగీకరించలేదు. ఆన్‌లైన్ ప్రవేశాలపై ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి యథాతధంగా అడ్మిషన్లు కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా.. అందరి అభిప్రాయాలు తీసుకుని వచ్చే సంవత్సరం నుంచి ఆన్‌లైన్ అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు సూచించింది.
సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డితో పాటు పలువురు విద్యార్థులు ఆన్ లైన్ అడ్మిషన్ల విషయంలో హైకోర్టును ఆశ్రయించారు.
ఆన్ లైన్ అడ్మిషన్లకు స్పష్టమైన విధివిధానాలు లేవని పిటిషనర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.