రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పుల కారణంగా దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు స్థాయికి చేరింది. వాస్తవానికి 2020-21లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పులు రూ.48,296 కోట్లు. అయితే, ఈ ఏడాది జనవరి నాటికే(మూడో త్రైమాసికం) ఈ అప్పులు రూ.73,913 కోట్లకు చేరాయి.
అంటే బడ్జెట్ అంచనాలను మించి జగన్ సర్కార్ అప్పులు చేసింది. ఇదే విషయాన్ని ఇటీవల కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ప్రధానంగా ప్రస్తావించింది. ఇక, 2019-20లో కూడా ఏపీ ప్రభుత్వం ఇదే బాటలో నడవడం గమనార్హం.
ఆ ఏడాది ఏకంగా 131.88 శాతం మించి అప్పులుచేసింది. ఆయా విషయాలను తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ త్రైమాసిక రుణ నిర్వహణ నివేదిక వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా 2020-21లో బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాల ప్రకారం రూ.33,191 కోట్లు అప్పులు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరినాటికే రూ.43,938 కోట్ల మేరకు అప్పు చేసినట్టు కాగ్ వెల్లడించింది.