ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కరోనా పరీక్షలు... రిజల్ట్ ఏంటి?

మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (09:25 IST)
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈయన కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఓ వైద్యుడిని కలిశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్‌కు ఈ పరీక్షలు నిర్వహించారు. 
 
ప్రస్తుతం కరోనా పాజిటివ్ లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడు ఇటీవల సొంతగా ఆస్పత్రిని నెలకొల్పారు. దీని ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఆ డాక్టర్ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్ వెళ్లారు. 
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆస్పత్రిని నెలకొల్పిన వైద్యుడు కరోనా లక్షణాలతో బాధపడుతుంటే కరోనా పరీక్షలు నిర్వహించగా, ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో అప్రమత్తమైన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కూడా ఈ కరోనా పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షా ఫలితాలు వచ్చేంత వరకు అంటే 36 గంటల పాటు మంత్రి అనిల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే, ఈ ఫలితాల్లో ఆయనకు కరోనా నెగెటివ్ అని రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటికే 300కు మించిపోయాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు