ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ మహమ్మారి మరింతగా ప్రజ్వలించకుండా, ప్రజలకు సోకుకుండా ఉండేందుకు వీలుగా అనేక దేశాలు లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నాయి. అలాంటి దేశాల్లో భారత్ కూడా ఉంది. అయితే, కరోనా వైరస్ ఎంతగా భయపెడుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది జన్మిస్తున్నారు. అలాంటి వారికి వలువురు కరోనా, లాక్‌డౌన్, లాక్‌డౌన్ కుమార్ ఇలాంటి పేర్లు పెడుతున్నారు. తాజాగా తమకు పుట్టిన ఓ బిడ్డకు ఓ జంట కరోనా కుమార్ అని పేరు పెట్టారు. ఇది ఏపీలోని కడప జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా వేంపల్లె పట్టణంలో పుట్టిన ఇద్దరికి ఈ వైరస్ పేర్లు పెట్టారు. మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరారు. ఆమె సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అలాగే, మరో మహిళ కూడా ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆసుపత్రి నిర్వాహకుడు అయిన డాక్టర్ బాషా వీరికి ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో అబ్బాయికి కరోనా కుమార్, అమ్మాయికి కరోనా కుమారి అని పేర్లు పెట్టారు. ఇందుకు వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో కరోనా పేరు స్థిరపడింది. దీంతో ప్రపంచాన్ని వణికించి, వేలాది మంది ప్రాణాలు హరించిన కరోనా వైరస్ పేరును... ఈ ఇద్దరు బిడ్డలు తమ జీవితాంతం మోయనున్నారు.