విజయవాడ : పరిశుభ్రత అనేది పాఠమో పాఠ్యాంశమో కాదని అదొక జీవన విధానమని, పరిసరాల పరిశుభ్రతతోనే ఉన్నతమైన సమాజాన్ని నిర్మించగలుగుతామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన అమరావతి కన్వన్షెన్ సెంటర్లో స్వచ్ఛ విద్యాలయాల పురస్కారాలకు ఎంపికైన ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఈ సంధర్బంగా మంత్రి గంటా మాట్లాడుతూ విద్య ద్వారానే ఏ సమాజ అభివృద్ధి అయినా సాధ్యమని అందుకే విద్యకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నారు.
రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్ -ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని, ఈ క్రమంలోనే టెక్నాలజీ లాభాలను డిజిటల్, వర్చువల్ తరగతుల రూపంలో అమలు చేస్తున్నామన్నారు. లోటు బడ్జెట్ వున్నా సీఎం చంద్రబాబు నాయుడు విద్యకు 25 వేల కోట్లకు పైగా కేటాయింపులు జరిపారని, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.
నాప్‌కిన్స్ కోసం 127 కోట్ల కేటాయింపులు జరపడం సాధారణ విషయం కాదని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత పెద్దమొత్తం బడ్జెట్ ఖర్చు పెట్టదన్నారు. టాయిలెట్లను నిర్మించి వదిలిపెట్టకుండా వాటి నిర్వహణ కోసం రూ.100 కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని, పరిశుభ్రత అందులో భాగంగా వుండాలని మంత్రి గంటా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా పరిశుభ్రతపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
గత సంవత్సరం జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయాలకు 21 పాఠశాలలు ఎంపికగా, ఈసారి 40 పాఠశాలలు ఎంపికయ్యాయని మంత్రి గంటా తెలిపారు. వీటిని ప్రతి ఒక్క పాఠశాల ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి పాఠశాల స్వచ్ఛ విద్యాలయంగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యాలయంలోని విద్యార్థి పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, ఆ దిశగా అడుగులు వేసి స్వచ్ఛ ఆంధ్ర నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని మంత్రి గంటా పిలుపునిచ్చారు.