ఉప్మా - పొంగల్‌లా విత్తనాలు తయారు చేయలేం : మంత్రి కన్నబాబు

బుధవారం, 3 జులై 2019 (11:25 IST)
విత్తనాలను అధిక ధరకు కొని అయినా సరే రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని, ఈ విషయంలో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. అందుకనుగుణంగానే విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని మంతి కన్నబాబు పేర్కొన్నారు. 
 
సాయంత్రం సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రులు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ శాసనసభ సభ్యులు మల్లాది విష్ణుతో కలిసి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. నవంబర్ నుంచే విత్తనాలు సేకరించి మే నెలలో విత్తులు నాటుకునే ముందుగానే రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాల్సి ఉంది. అయితే విత్తన సరఫరాకు ఎటువంటి ప్రత్యేక ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వం స్తబ్ధుగా ఉండటం వల్ల రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు. 
 
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న ప్రమాణస్వీకారం చేసిన తదుపరి రోజే రైతు సంక్షేమం కోసం సమీక్ష నిర్వహించి విత్తనాల లభ్యత, సరఫరాపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో 50 వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు మాత్రమే నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 4.41 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల డిమాండ్ ఉండగా ఇప్పటికే 3 లక్షల 8 వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరించి పంపిణీ పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం 2 లక్షల 80 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే సీజన్‌లో పంపిణీ చేయగలిగిందన్నారు. 

వరివంగడాల పంపిణీలో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో గతంలో 35 వేల క్వింటాళ్లు సరఫరా చేయగా తమ ప్రభుత్వం 70 వేల క్వింటాళ్ల వరకు ఇప్పటికే పంపిణీ చేశామని తెలిపారు. విజయనగరం జిల్లాలో గతంలో 39 వేల క్వింటాళ్లు సరఫరా చేయగా తమ ప్రభుత్వం 46 వేల క్వింటాళ్ల వరకు పంపిణీ చేశామని తెలిపారు. విశాఖపట్టణం జిల్లాలో గతంలో 24 వేల క్వింటాళ్లు సరఫరా చేయగా తమ ప్రభుత్వం 35 వేల క్వింటాళ్లు పంపిణీ చేశామని తెలిపారు. వర్షాభావ స్థితిగతులను పరిగణలోకి తీసుకొని పశుగ్రాసం ఉలవలు, అలసందల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు భరోసాగా నిలవడంతో పాటు వడ్డీలేని రుణాలు, సబ్సిడీలో విత్తనాలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు అన్ని విధాల అండగా నిలుస్తున్నామన్నారు. 
 
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విత్తనాల పంపిణీ సందర్భంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తనాలను ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై గతంలో అధికారులు ఎన్నిసార్లు నివేదించినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో 50 సార్లు మార్కెఫెడ్, వితనాభివృద్ధి సంస్థలు ఆనాటి ప్రభుత్వానికి లేఖలు పంపినా ఎటువంటి స్పందన రాలేదని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 19న  నాటి ముఖ్యమంత్రికి అప్పటి వ్యవసాయ శాఖ కార్యదర్శి పంపిన నోట్ ను విలేఖర్ల సమావేశంలో మంత్రి చదివి వినిపించారు. బిల్లులపై రూ.108 కోట్లు ఇవ్వాల్సిందిగా అప్పటి వ్యవసాయ శాఖ కార్యదర్శి లేఖ రాసినా స్పందన లేదని మంత్రి తెలిపారు. 
 
కొబ్బరి రైతులను ఆదుకునేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేట, కొత్తపేట, నగరం, తాటిపాక, ముమ్మిడివరం వంటి 5 ప్రాంతాల్లో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరను అందిస్తున్నామన్నారు. బాలకోబ్రా రకంకు రూ.9,920, మిల్లింగ్ కోబ్రా రకంకు రూ.9,521 ధర అందించడం జరుగుతుందన్నారు. మార్కెట్ సెస్‌ను తొలగిస్తున్నామని ఆదేశాలు జారీ చేయగానే నాఫెడ్, ఆయిల్ ఫెడ్ సంస్థలు కొనుగోలుకు ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరికి ధర పడి పోకుండా చూస్తున్నామని మంత్రి తెలిపారు.
 
గత ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడంలో విఫలమైందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక, తెలంగాణ, బరోడా(గుజరాత్) వంటి ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు పంపించిందని మంత్రి తెలిపారు. ఆయా ప్రాంతాలలో నాణ్యమైన విత్తనాల లభ్యత ఉందని తెలుసుకొని, అధిక ధర వెచ్చించైనా నాణ్యమైన విత్తనాల సేకరణకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కురసాల అన్నారు. 

గత ప్రభుత్వం విత్తన పంపిణీ సంస్థలైన మార్క్ ఫెడ్, ఏపీ సీడ్స్ వంటి సంస్థలకు రూ.380 కోట్ల చెల్లింపులు జరపాల్సి ఉండగా వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.980 కోట్ల మేర పెండింగ్ బిల్లులు రైతులకు చెల్లించాల్సి ఉందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 
 
జలవనరుల శాఖ మంత్రి పోనుబోయిన అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇరిగేషన్ తదితర ప్రాజెక్టుల వ్యయాలపై రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఖర్చులను తగ్గించుకునే దిశలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నదుల అనుసంధానం, సముద్రంలో వృథాగా కలిసే జలాలను ఒడిసిపట్టి ఇరు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసే దిశలో ఒక మంచి అవగాహనతో పొరుగు రాష్ట్రాలతో సంబంధాలను కొనసాగించే విధానాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండే అడుగులు వేస్తున్నారని మంత్రి అనిల్  కుమార్ యాదవ్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు