ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారమే భూసేకరణ... మంత్రి నారాయణ

సోమవారం, 24 ఏప్రియల్ 2017 (19:20 IST)
విజయవాడ : రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారమే భూములు తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలశాఖా మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోడానికి ప్రయత్నిస్తున్నామంటూ మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 
 
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇలా చేయడం సరికాదన్నారు. వాస్తవానికి పెనుమాక గ్రామంలో 60 శాతానికి పైగా రైతులు ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారని.. మరో 1600 ఎకరాల భూమి కావాల్సి ఉండగా.. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం భూసేకరణకు సిద్ధమయ్యామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ మేరకు యాక్ట్ లోని నిబంధనలన్నీ పాటిస్తూనే.. రైతులకు ప్రాధమిక నోటీసులు జారీ చేశామన్నారు. 
 
60 రోజుల్లోగా అభ్యంతరాలుంటే చెప్పుకోవాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నామని తెలిపారు. అనంతరం మరో నెల రోజుల గడువుతో ఇంకోసారి నోటీసులిస్తామని.. అప్పుడు కూడా అభ్యంతరాలుంటే.. తమకు నివేదిస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. చట్ట ప్రకారం విడతలవారీగా ఒక్కో పని పూర్తిచేసుకుంటూ వెళుతుంటే.. కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారని.. విచారణ అనంతరం.. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం భూసేకరణ చేపట్టాలని న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. 
 
ఈ ఉత్తర్వులను కూడా వక్రీకరించి.. భూసేకరణ ఆపేయాలని కోర్టు ఆదేశించినట్టు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెబుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలా చేయడం తగదని.. రైతులు కోరుకున్నట్టు.. కోర్టు ఆదేశాల ప్రకారమే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద భూసేకరణ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 
 
ఎన్నికలన్నీ ఒకేసారి.. 
రాష్ట్రంలో ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించడంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని మంత్రి నారాయణ తెలిపారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నారన్న విలేకరుల ప్రశ్నకు ఆయనిలా సమాధానమిచ్చారు. దేశ వ్యాప్తంగా కూడా ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే బాగుంటుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నందున.. రాష్ట్రంలోనూ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించడమే మంచిదన్న నిర్ణయానికొస్తే.. సాధారణ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి