జగన్ మాట తీరు మార్చుకోవాలి, అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాలు... మంత్రి శిద్ధా

సోమవారం, 8 మే 2017 (19:49 IST)
అమరావతి : కాలుష్య, ప్రమాద రహిత ఏపీ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. సచివాలయంలోని మూడో బ్లాక్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రాష్ట్రమైన నవ్యాంధ్రలో పరిశ్రమల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. ఆదాయం పెరుగుదలకు పారిశ్రామిక ప్రగతి ఎంతో అవసరమన్నారు. అదేసమయంలో పర్యావరణ రక్షణతో పాటు కాలుష్య నివారణకు కూడా ప్రాధాన్యతినిస్తున్నామన్నారు. ఇదే విషయమై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించామన్నారు. నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. 
 
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణతో పాటు కాలుష్య కారకాల నిరోధానికి పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాలుష్య, ప్రమాద రహిత రాష్ర్టంగా ఏపీని తీర్చిదిద్ధడమే ధ్యేయమని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిశ్రమలను పర్యవేక్షించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలకు వెనుకాడబోమన్నారు. రిటైర్మెంట్ గడువును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కోరారని, సీఎం చంద్రబాబుతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. పాలిథీన్ నివారణకు 13 జిల్లాల అధికారులతో చర్చించి, వారిని అప్రమత్తం చేశామన్నారు.
 
అటవీ ఉత్పత్తుల సాగు విస్తీర్ణం పెంపుదలకు కృషి
రాష్ర్టంలో అటవీ ఉత్పత్తుల సాగు విస్తీర్ణం పెంపుదలకు కృషి చేస్తున్నామని రాష్ర్ట అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. వెదురు, జీడి వంటి ఉత్పత్తుల ద్వారా ఆదాయం పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకూ 30 వేల మందికిపైగా జీవనోపాధి కల్పించామన్నారు. రాష్ర్టంలో 23 శాతానికి పైగా అటవీ విస్తీర్ణం ఉందన్నారు. మరో 15 శాతం మేర గ్రీన్ కవర్ పెంపుదలకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో చెట్ల పెంపకం చేపట్టాలని భావిస్తున్నామన్నారు. ఇందుకోసం ఎంతవ్యయమైనా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారన్నారు. భూగర్భ జలాలు పెంపుదలకు అటవీ భూముల్లో చెక్ డ్యాములు, ఇంకుడు గుంతల తవ్వకం చేపట్టనున్నామన్నారు. అటవీ ప్రాంతాల్లో పర్యావరణానికి ప్లాస్టిక్ వాడకాన్ని అడ్డకుంటామన్నారు. రాష్ర్టంలో ఎకో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇందుకోసం అవసరమైన పాయింట్లను గుర్తించామని మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు.
 
జూన్-జులైలో 2 వేల మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం వేలం...
రాష్ర్టంలో 8,200 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం నిల్వలున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో అనుమతులు రానున్నాయనన్నారు. అనుమతుల రాగానే 2,020 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం వేలం వేయనున్నట్లు మంత్రి తెలిపారు. జూన్, జులై లో వేలం నిర్వహించే అవకాశముందన్నారు. మిగిలిన 6 వేల మెట్రిక్ టన్నులకూ కేంద్రం నుంచే అనుమతులు రాగానే వేలం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి నేటి వరకూ 4,266 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.959 కోట్లు ఆదాయం వచ్చిందని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. 
 
25 కోట్ల రూపాయలతో 8 గోదాములు నిర్మించామన్నారు. త్వరలో వాటిని ప్రారంభించనున్నామన్నారు. రాష్ర్టంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎర్ర చంద నిల్వలను ఈ గోదాములకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆ నిల్వలు రాగానే, వాటికి ఏ, బీ, సీ గ్రేడింగ్ లు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగింగ్ నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. స్మగింగ్ చేస్తున్న వారికి ఆస్తుల స్వాధీనానికి వెనుకాడబోమన్నారు. స్మగింగ్ చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు.
 
త్వరలో అటవీ సిబ్బందికి ఆయుధాలు...
ఎర్ర చందన స్మగ్లర్ల నుంచి రక్షణకు గానూ అటవీ సిబ్బందికి త్వరలో ఆయుధాలు సమకూర్చనున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. కేంద్ర హోం శాఖ నుంచి అనుమతులు రాగానే ఆయుధాలు అందజేస్తామన్నారు. అటవీ సిబ్బందికి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
 
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్...
రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు అహర్నిశలూ కృషి చేస్తుంటే, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రాష్ర్ట అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఆరోపించారు. పరిశ్రమల స్థాపనకు దేశ విదేశాలు తిరుగుతున్న సీఎం చంద్రబాబుకు అక్కడి ప్రవాసాంధ్రులు బ్రహ్మరథం పడుతుంటే, జగన్ విమర్శలు అర్థరహితమన్నారు. ఇప్పటికైనా జగన్ మాట తీరు మార్చుకోకుంటే, ప్రజాక్షేత్రంలో అబాసుపాలవ్వడం ఖాయమన్నారు.

వెబ్దునియా పై చదవండి