సాధారణంగా ఏ మతంలోనైనా దేవుళ్లను కించపరచడం అనేది తప్పే అయినప్పటికీ, హిందూ మతంలో దానికి కూడా ప్రజాస్వామ్యం కనబడుతుంది. వినాయక చవితి వస్తే గబ్బర్ సింగ్ గణపతి అని.. ముఠామేస్త్రీ గణపతి అని.. ఇంకొంతమందైతే మరో అడుగు ముందుకేసి నవ్యాంధ్ర నిర్మాణ కూలీ గణపతి అని ఓటరులందరూ ఇప్పటివరకు లంబోదరుడినే ఆటలాడుకున్నారు. ఈ విషయంలో ఇప్పుడు కొత్తగా నేతలు కూడా ఇందులో మేమేమీ తక్కువ తినలేదంటూ ముందుకు దూసుకొస్తున్నారు.
ఇప్పటికే తిరుమల దేవస్థానంలో అన్యమతస్తులకే పెద్ద పీట వేసారని ఇరుపక్షాలు నిందలు మోస్తున్న నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీలోని ఒక నేత మొన్నటికి మొన్న వెంకటేశ్వర స్వామి పేరు చివర తమ కులం పేరు జోడించి మా వెంకన్న.... అనేసి తర్వాత చెంపలు వేస్కొంటున్నానన్నా, అదే పార్టీ వారు ఇటీవల భారీ ఖర్చుతో జరుపుకున్న ఒక మెగా ఈవెంట్‌లో పార్టీ పెద్దల మెప్పు కోసమో ఏమో కానీ సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామిని రాజకీయ విమర్శలలోకి లాగి జోకులు వేయడం, ఏక వచన సంబోధనలు చేస్తూంటే వారించడం మాని పగలబడి నవ్వుతున్న మహామహుల వీడియోలను చూస్తూంటే ఇదేనా మన నవ సమాజం అని బాధపడుతున్న సగటు పౌరుడి బాధని వినే నాధుడెవ్వరో ఆ ఏడుకొండలవాడికే తెలియాలి.