జగన్ రెడ్డి... బురద రాజకీయాలు ఆపి, వరద బాధితులను ఆదుకోండి

శనివారం, 20 నవంబరు 2021 (14:49 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందుల‌ను  ఎదుర్కొంటున్నార‌ని, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టంతోపాటు, ప్రాణ, ఆస్తి ‎ నష్టం జరిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 
కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా, 12 మంది చనిపోయార‌ని, ప్రజల‌ ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‎వరదల వల్ల ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటు రోడ్లపై ఉన్నార‌న్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే, ముఖ్యమంత్రి వరదలపై శద్ర పెట్టకుండా, బురద రాజకీయాలు చేస్తూ ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం చేయటం సిగ్గుచేట‌న్నారు. 
 

జగన్ రెడ్డికి కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ద, వరద బాధితులను ఆదుకోవటం లేద‌న్నారు. కుప్పంలో ఎన్నికల నాడు పొరుగు రాష్ట్రాల నుంచి బస్సుల్లో జనాల్ని తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించార‌ని, కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం పక్క జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చి సహాయం అందించటం లేద‌న్నారు. రాష్ట్రానికి వరద ముప్పు ఉందని తెలిసినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా  వ్యహవరించటం వల్లే ఇంత పెద్ద మెత్తంలో పంట, ప్రాణ, ఆస్తి నష్టం జరిగింద‌ని ఆరోపించారు.  
 
 
దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల‌ని, ‎వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడడంతోపోటు వెంటనే సహాయ చర్యలు చేపట్టాల‌న్నారు. చనిపోయిన వారి ‎ కుటుంబాలకు తక్షణమే ఆర్దిక సాయం అందించాల‌ని డిమాండు చేశారు. ఆరుగాలం శ్రమించి చేతికందిన పంట నీట మునగటంతో అన్నదాతలు ఆవేదన, ఆందోళన చెందుతున్నార‌ని, ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అంచనా వేసి, రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాల‌న్నారు. వ‌రదల వల్ల అన్ని కోల్పోయి ఆపన్న హస్తం కోసం బాధితులు ఎదురు చూస్తున్నార‌ని, టీడీపీ కార్యకర్తలకు నాయకులు, బాధితులకు అండగా నిలబడి సహాయ చర్యలు చేపట్టాలని విజ్నప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు