ఇటీవల వెల్లడైన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా నేతల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. తెలంగాణాలో భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోవాడనికి ప్రధాన కారకుల్లో నిరుద్యోగులు ఒకరు. పైగా, తెలంగాణాలో వచ్చిన ఫలితాలే ఏపీలోనూ పునరావృతమవుతాయనే బహిరంగ చర్చ ఏపీలో సాగుతుంది. దీంతో అధికార వైకాపా నేతలు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఇందులోభాగంగా, నిరుద్యోగులను ప్రసన్న చేసుకునేందుకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. తాజాగా గ్రూపు-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త సిలబస్ ప్రకారం గ్రూపు-2 పరీక్షలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నారు.
వీటిలో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూపు-2 ఉద్యోగాల స్క్రీనికి పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహిస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్స్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష రెండూ ఆఫ్ లైన్ మోడ్‌లోనే నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.