పండుగ సీజన్‌లో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ పండుగ సీజన్‌లో నడిపే ప్రత్యేక బస్సుల్లో వసూలు చేసే 50 శాతం అదనపు చార్జీలను స్వస్తి చెప్పినట్టు తెలిపింది. అలాగే, దసరా పండుగకు 1081 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపింది. వీటిని ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబరు పదో తేదీ వరకు నడుపుతామని వెల్లడించింది. ఈ బస్సుల్లో ప్రయాణం చేయదలచిన వారు సోమవారం నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్ని వెల్లడించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ సర్వీసులను పక్కనపెడితే ప్రభుత్వ రంగంలోని ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలు సాధారణ చార్జీలపై 50 శాతం చార్జీలను అదనంగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహా సంస్కృతికి ఏపీఎస్ఆర్టీసీ స్వస్తి చెప్పేసింది.
ఈ ఏడాది దసరా సందర్భంగా ప్రజల రవాణా నిమిత్తం 1,081 అదనపు సర్వీసులను నడపనున్నట్లు ఆ సంస్థ సోమవారం రాత్రి ప్రకటించింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 దాకా కొనసాగనున్న ఈ స్పెషల్ సర్వీసుల్లో సాధారణ చార్జీలే వసూలు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది.
దసరా నేపథ్యంలో ప్రత్యేక బస్సులుగా నడవనున్న ఆర్టీసీ సర్వీసులు... విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. విజయవాడ నుంచి విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ... విజయవాడ నుంచి తిరుపతి, రాయలసీమ జిల్లాలు... విజయవాడ నుంచి అమలాపురం, భద్రాచలంల మధ్య నడవనున్నాయి. అలాగే, పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ బస్సులను నడుపనున్నారు.