ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

ఐవీఆర్

బుధవారం, 19 మార్చి 2025 (23:14 IST)
హిందూజా గ్రూప్ యొక్క భారతీయ ప్రతిష్టాత్మక సంస్థ, ప్రముఖ వాణిజ్య వాహన తయారీదారు అశోక్ లేలాండ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో తమ కొత్త బస్సు తయారీ కేంద్రంను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లు, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రారంభించారు. ఈ వేడుకలో భాగంగా, అశోక్ లేలాండ్, హిందూజా గ్రూప్‌లు స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు యొక్క తాళం చెవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు, దీనిని మంత్రి శ్రీ నారా లోకేష్ అందుకున్నారు, ఇది రాష్ట్రంలో పర్యావరణ అనుకూల ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి వారి ఉమ్మడి నిబద్ధతకు ప్రతీక.
 
ఈ వేడుకలో రవాణా, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి శ్రీ ఎం. రామ్ ప్రసాద్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీ టి. జి. భరత్, కృష్ణా జిల్లా ఎంపీ శ్రీ వి. బాలశౌరి, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వై. వెంకట రాయ్, శ్రీ షోమ్ అశోక్ హిందూజా, అధ్యక్షుడు, ఆల్టర్నేటివ్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ, హిందూజా గ్రూప్ తో పాటుగా డీలర్లు, కస్టమర్లు, సరఫరాదారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
 
విజయవాడ నుండి 40 కి.మీ దూరంలో ఉన్న మాలవల్లిలో ఉన్న ఈ ఆధునిక ప్లాంట్ 75 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను అనుసరించటానికి అధునాతన తయారీ సాంకేతికతలను కలిగి వుంది. అశోక్ లేలాండ్ డీజిల్ బస్సులు, స్విచ్ మొబిలిటీ యొక్క ఎలక్ట్రిక్ బస్సుల పూర్తి శ్రేణిని తయారు చేయడానికి అనువుగా ఈ ప్లాంట్ రూపొందించబడింది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4,800 బస్సులు. ఆధునిక అభ్యాస కేంద్రం, అధునాతన సేవా శిక్షణా కేంద్రం, నలంద ఇక్కడ ఉన్నాయి. కొత్తగా ప్రారంభించబడిన ప్లాంట్ స్థానిక కార్మికుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి గణనీయంగా దోహదపడుతుంది. పర్యావరణ పరిరక్షణను పెంపొందించడానికి, ఇది పైకప్పు సౌర ఫలకాలు, LED లైటింగ్, ప్లాంట్ లోపల రవాణా కోసం బ్యాటరీతో పనిచేసే వాహనాలు, సానుకూల నీటి సమతుల్య చర్యలు, జీరో-డిశ్చార్జ్ వ్యవస్థతో కూడిన గ్రీన్ ఫెసిలిటీగా ఇది నిలుస్తుంది.
 
గౌరవనీయ మంత్రి శ్రీ నారా లోకేష్ మాట్లాడుతూ  “ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రతిష్టాత్మకమైన సందర్భం. మన  అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు అశోక్ లేలాండ్‌ను స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. అభివృద్ధి చెందుతున్న తయారీ కేంద్రంగా రాష్ట్ర ఖ్యాతిని ఈ ప్లాంట్ పునరుద్ఘాటిస్తుంది . ఉపాధిని అందించడంలో, నైపుణ్య అభివృద్ధిని చేయడంలో మరియు రాష్ట్ర యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడంలో  కీలక పాత్ర పోషించనుంది” అని అన్నారు 
 
అశోక్ లేలాండ్ చైర్మన్ శ్రీ ధీరజ్ జి. హిందూజా మాట్లాడుతూ, “రాష్ట్రానికి ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ముందుచూపుతో  ప్రేరణ పొంది, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తుండటం పట్ల మేము సంతోషిస్తున్నాము. అశోక్ లేలాండ్, ఇతర హిందూజా గ్రూప్ సంస్థల ద్వారా ఈ రాష్ట్రంతో మా సంబంధం అనేక దశాబ్దాలుగా కొనసాగుతోంది. కొత్త ప్లాంట్ ప్రారంభం ఈ మహోన్నత రాష్ట్రంలో అశోక్ లేలాండ్‌కు మరో అధ్యాయానికి నాంది పలికింది, ఇక్కడ మా గ్రూప్ ఆర్థిక వృద్ధిని నడిపించడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, ఈ ప్రాంతంలో సంపదను సృష్టించడానికి అవసరమైన రీతిలో మరిన్ని అవకాశాలను అన్వేషించడానికి కట్టుబడి ఉంది” అని అన్నారు.
 
అశోక్ లేలాండ్ ఎండి & సీఈఓ శ్రీ షేను అగర్వాల్ మాట్లాడుతూ, “కొత్త ప్లాంట్ ప్రారంభంతో, అశోక్ లేలాండ్ భారతదేశంలో #1 బస్సు బ్రాండ్‌గా, ప్రపంచవ్యాప్తంగా టాప్ 5లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. భారతదేశంలో పూర్తిగా నిర్మించిన బస్సులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ సౌకర్యం మాకు సహాయపడుతుంది. కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి ఇప్పుడే ప్రారంభమైంది. మా పెద్ద ఆర్డర్ బుక్ కారణంగా, ప్లాంట్ మొదటి రోజు నుండి 100% సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభిస్తుంది. కొత్త ప్లాంట్‌లో అత్యాధునిక పరికరాలు అధిక స్థాయి ఆటోమేషన్‌తో అమర్చబడి ఉన్నాయి, ఇది అత్యున్నత నాణ్యత ప్రమాణాల ఉత్పత్తులను తయారుచేయడానికి మా నిబద్ధతను సూచిస్తుంది” అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు