పోలీస్ వాహనాలా? మీ ప్రచార రథాలా? ఆ రంగులేంటి? అచ్చెన్నాయుడు

మంగళవారం, 22 డిశెంబరు 2020 (12:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ మరో వివాదంలో చిక్కుకుంది. గతంలో పోలీసులు చేసిన తప్పిదాలకు సాక్షాత్ పోలీస్ బాస్ హైకోర్టు బోనులో నిలబడ్డారు. ఇపుడు అలాంటి తప్పే గుంటూరు జిల్లా పోలీసులు చేశారు. ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ల కోసం సమకూర్చిన స్కూటీలకు అధికార వైకాపా రంగులను వేశారు. పైగా, వీటిని గస్తీ తిరిగే మహిళా పోలీసులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని అందజేశారు. ఈ చర్యను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై ఏపీ టీడీపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు ఓ లేఖ రాశారు. 
 
పోలీస్‌ షీ టీమ్స్‌కు వైకాపా రంగులు వేయడమేకాకుండా ప్రభుత్వ అధికారే వాటిని ప్రారంభించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని అన్నారు. మహిళల రక్షణ కోసం టీడీపీ ప్రభుత్వం షీటీమ్స్‌ను బలోపేతం చేసి దాదాపు 800 వాహనాలకు పైగా సమకూర్చిందని చెప్పుకొచ్చారు. నేడు ఆ వాహనాలకే వైసీపీ రంగులు అద్ది తిరిగి పంపిణీ చేశారని మండిపడ్డారు. 
 
ఇప్పటికే రంగుల విషయంలో ప్రభుత్వం చర్యలను సర్వోన్నత న్యాయస్థానం ఎండగట్టిందని ఆయన గుర్తుచేశారు. రంగుల కోసం రూ.3500 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. రాత్రింబవళ్లు శాంతి భద్రతలను సంరక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకు రాజకీయ ముద్ర వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వాహనాలకు రంగుల వేసి ప్రచార రథాలుగా మార్చారన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు